కిడ్నీ పరీక్షలు తప్పనిసరి..!
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:09 AM
దేశంలో 20 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి విధిగా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకునేలా జాతీయ విధానం తీసుకురావాలని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
20 ఏళ్లు నిండితే ప్రతి 6 నెలలకు టెస్టులు
డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు విస్తరించాలి
కేంద్రానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులు
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): దేశంలో 20 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి విధిగా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకునేలా జాతీయ విధానం తీసుకురావాలని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. యువతలో కూడా కిడ్నీ సమస్యలు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తంచేసింది. చాలామంది తమ కిడ్నీలు ఎంతమేర దెబ్బతిన్నాయో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారని, ఈ ప్రమాదకర పరిస్థితికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని సూచించింది.
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధులలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ఒకటి అని పేర్కొంది. ముందస్తుగా వ్యాధిని గుర్తించడం, చికిత్స, దానిపై పరిశోధనకు సంబంధించి సమగ్ర విధానం రూపొందించాలని సూచించింది. ీకిడ్నీ జబ్బులకు ప్రధాన కారణం రక్తపోటు, మధుమేహమేనని తెలిపింది. వ్యవసాయ కూలీలతో పాటు ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేవారిలో ఇది ఎక్కువగా ఉంటున్నట్లు పేర్కొంది. తీవ్రమైన ఎండవేడిమి, తరచూ డీహైడ్రేషన్‌కు గురి కావడం, పురుగుమందుల ప్రభావం, కలుషిత తాగునీరు, భారలోహాల వంటివి కిడ్నీ జబ్బులకు కారణమని.. దీనిపై శాస్త్రీయ పరిశోధన అవసరమని కమిటీ అభిప్రాయపడింది. కిడ్నీ జబ్బుల వైద్య సేవల్లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలున్నట్లు కమిటీ గుర్తించింది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ఆర్థికంగా వెనుకబడ్డవర్గాలు, గిరిజన తెగలు, మారుమూల ప్రాంత వాసులకు రోగనిర్ధారణ, వైద్య సేవలు అందుబాటులో లేవని తెలిపింది. ఈ అసమానతలు తగ్గించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో వ్యాపిస్తున్న కారణం తెలియని మూత్రపిండాల వ్యాధి గురించి కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డి సీజెస్ కింద ఈ పరీక్షలకు ఉచితంగా నిర్వహించాలని కోరింది.
కమిటీ సిఫారసుల్లో కొన్ని...
కిడ్నీ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఎక్కువగా సీరం క్రియాటినిన్ పరీక్షలు చేస్తారు. కిడ్నీలు 50 శాతం దెబ్బతినేవరకు కూడా క్రియాటిన్ స్థాయి సాధారణంగానే ఉంటుంది. అందువల్ల క్రియాటిన్ ఒక్కటే కాకుండా ఈజీఎ్‌ఫఆర్ (ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్), యూరిన్ ఆల్బుమిన్, ప్రోటీన్ పరీక్షలు తప్పనిసరి చేయాలి.
ఏ ల్యాబ్‌లో క్రియాటినిన్ పరీక్ష చేసినా అదనపు రుసుము తీసుకోకుండా ఈజీఎ్‌ఫఆర్ వ్యాల్యూను రిపోర్టులో చేర్చేలా నిబంధనలు తీసుకురావాలి.
సీకేడీరోగులకు ఆరోగ్యబీమా, ఆర్థికభద్రత, తక్కువ ధరలకే రెనాల్‌కేర్ సర్వీసెస్, మారుమూల ప్రాం తాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
ఇంటింటికీకి వెళ్లి కిడ్నీజబ్బులపై అవగాహన కల్పించాలి. పాఠశాల విద్యలోనే సీకేడీపై పాఠాలుండాలి.