కొత్తగా ఒలింపిక్ శిక్షణ కేంద్రాలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:21 AM
ఖేలో ఇండియా.. గత పదేళ్లలో దేశ క్రీడా ప్రగతికి ఇంధనంలా పని చేస్తున్న పథకం. అలాంటి పథకానికి ఈ ఏడాది ఏకంగా రూ.29 వేల కోట్లు కేటాయించడం, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం క్రీడా బడ్జెట్‌ను..
ఫీడర్ సెంటర్లుగా ఉత్కృష్ట విద్యాలయాలు
యువత కోసం ఖేలో ఇండియా ఎమర్జింగ్ స్కీమ్
అగ్ర శ్రేణి క్రీడాకారుల శిక్షణకు రూ.7,400 కోట్లు
తెలంగాణలో 19 అకాడమీలకు ‘ఖేలో’ గుర్తింపు
బ్యాడ్మింటన్ సహా ఇతర క్రీడలపైనా ప్రత్యేక దృష్టి
‘ఆంధ్రజ్యోతి’తో సాయ్ డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు
ఖేలో ఇండియా.. గత పదేళ్లలో దేశ క్రీడా ప్రగతికి ఇంధనంలా పని చేస్తున్న పథకం. అలాంటి పథకానికి ఈ ఏడాది ఏకంగా రూ.29 వేల కోట్లు కేటాయించడం, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం క్రీడా బడ్జెట్‌ను రూ.4వేల కోట్ల నుంచి రూ.36,441 కోట్లకు పెంచడంతో క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖేలో ఇండియా పథకం కింద చేపట్టనున్న కార్యక్రమాలు, శిక్షణ కేంద్రాల్లో అభివృద్ధి చేయనున్న మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు లక్ష్యాలపై భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) డిప్యూటీ డైరెక్టర్ ఎస్.హిమబిందు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
ఖేలో ఇండియాతో దేశ క్రీడా ముఖచిత్రం ఎలా మారనుంది?
దేశ క్రీడాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులను తీసుకురావాలనే లక్ష్యంతోనే ఖేలో ఇండియా పథకాన్ని పూర్తిగా నవీకరించాం. మా ప్రణాళికలకు తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం రూ.36,441 కోట్ల భారీ బడ్జెట్‌ను క్రీడారంగం కోసం కేటాయించడం దేశ క్రీడా చరిత్రలోనే కీలకమైన మలుపు. 2017 ఖేలో ఇండియా కార్యక్రమానికి అంకురార్పణ జరిగినప్పటి నుంచి నేను ఈ పథకం రూపకల్పనలో ముఖ్య భూమిక పోషిస్తున్నా. ప్రతిభావంతులను గుర్తించడం, వారికి శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టు వారిని అన్ని కోణాల్లో సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఖేలో ఇండియాను ప్రారంభించాం. ఇందులో భాగంగానే యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, ట్రైబల్ గేమ్స్, వింటర్ గేమ్స్ ఇలా వివిధ పోటీలను ప్రవేశపెట్టాం. వీటి వల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలు లభించాయి. ఇప్పుడు క్రీడా సదుపాయాల అభివృద్ధితోపాటు స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ల స్థాపన, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణను క్రీడాకారులకు అందించడంపై దృష్టి పెట్టాం.
ఖేలో ఇండియా ప్రాధాన్యతలు ఏంటి?
దేశంలో క్రీడారంగం అభివృద్ధిని వేగవంతం చేసేందుకు 12 అంశాలపై దృష్టి సారించాలని ప్రాథమికంగా నిర్ణయించాం. ఇందులో ప్రధానమైనవి శిక్షణ సదుపాయాలను మెరుగుపర్చడం, ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం. కొత్తగా ఒలింపిక్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖేలో ఇండియా గుర్తింపు కలిగిన అకాడమీలు, జాతీయ ఎక్స్‌లెన్స్ సెంటర్లు, ఖేలో ఇండియా ఎక్స్‌లెన్స్ సెంటర్లు, సాయ్ ట్రైనింగ్ సెంటర్లకు అనుసంధానం చేస్తాం. రాష్ట్రాల్లోని ఏకలవ్య, నవోదయ పాఠశాలల్లో ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయాలను ఏర్పాటు చేసి, ఫీడర్ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నాం. ఖేలో ఇండియా అథ్లెట్ పథకం ద్వారా ప్రస్తుతం క్రీడల్లో సత్తా చాటిన వారిని గుర్తించి, ఒక్కొక్కరిపై ఏడాదికి రూ.6లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇకపై ఈ మొత్తాన్ని రెట్టింపు చేయనున్నాం. అలానే, కనీసం 30 వేల మంది క్రీడాకారులను ఈ కార్యక్రమంలో భాగం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దీంతోపాటు ఖేలో ఇండియా ఎమర్జింగ్ పథకాన్నీ ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. జిల్లా స్థాయి నుంచి ఖేలో ఇండియా గేమ్స్ వరకు ఒక క్రీడాకారుడు చేరుకునేందుకు ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇక, ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించే అగ్రశ్రేణి క్రీడాకారుల ప్రత్యేక శిక్షణ, ఇతరత్రా కార్యక్రమాల కోసం రూ.7,400 కోట్లు ఖర్చు చేయనున్నాం.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ శిక్షణ కేంద్రాలను మార్చనున్నారా?
ఆర్మీ, రైల్వేసహా వివిధ కేంద్రసంస్థలకు చెందిన క్రీడాశిక్షణ కేంద్రాలు, బళ్లారిలోని జేఎ్‌సడబ్ల్యూ అకాడమీ, హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీ, గన్ ఫర్ గ్లోరీ అకాడమీలు ఖేలో ఇండియా అక్రిడేటడ్ సెంటర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న అకాడమీలు, శిక్షణ కేంద్రాల్లోని సౌకర్యాలను ఉపయోగించుకుంటూనే.. మరో వైపు ఖేలో ఇండియా, సాయ్ సెంటర్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటాం.
- హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)
తెలంగాణలో చేపట్టే కార్యక్రమాలేంటి?
ఇతర రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉన్నా ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు ఇచ్చాం. డిసెంబరులో ఈ పోటీల నిర్వహణకు సన్నాహలు ప్రారంభించాం. ఇప్పటికే రాష్ట్రంలో 33 ఖేలో ఇండియా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో హైపెర్ఫామెన్స్ సెంటర్ ఏర్పాటు చేసి, 254 మంది అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్నాం. మహిళా క్రీడాకారుల కోసం ఇప్పటివరకు రాష్ట్రంలో 127 ఖేలో ఇండియా అస్మిత లీగ్‌లను నిర్వహించాం. ఇందులో సుమారు 20 వేల మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 19 అకాడమీలకు ఖేలో ఇండియా గుర్తింపు ఇచ్చాం. హైదరాబాద్‌కు బ్యాడ్మింటన్ హబ్ అనే ప్రత్యేకత ఉంది. భవిష్యత్‌లో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, సైక్లింగ్, ఫుట్‌బాల్, టెన్నిస్ క్రీడాంశాల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నాం.