Kharif Grain: సంక్రాంతి దాకా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు!
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:24 AM
వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు మరో వారం రోజుల్లో పూర్తికానున్నాయి. ఇప్పటికే లక్ష్యంలో 95శాతానికిపైగా.....
ఆ తర్వాత కొనుగోలు కేంద్రాల మూసివేత
ఇప్పటికే 69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
మరో 2 లక్షల టన్నులు వచ్చే అవకాశం
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు మరో వారం రోజుల్లో పూర్తికానున్నాయి. ఇప్పటికే లక్ష్యంలో 95శాతానికిపైగా సేకరించిన నేపథ్యంలో సంక్రాంతి వరకు ధాన్యాన్ని కొని ఆ తర్వాత కేంద్రాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అడపాదడపా ధాన్యం కేంద్రాలకు వస్తోంది. దీంతో సంక్రాంతికి ధాన్యం సేకరణ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. 2025-26 వానాకాలంలో 70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 8,300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్టోబరులో ధాన్యం సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు 69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఇందులో 37 లక్షల టన్నుల దొడ్డు, 32 లక్షల టన్నుల సన్న ధాన్యం ఉన్నాయి. 13.70 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొని రూ.16,942 కోట్లు ఖాతాల్లో జమచేశారు. ట్యాబ్ ఎంట్రీ చేసిన రెండు, మూడు రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించారు. సన్న ధాన్యం విక్రయించిన రైతులకు ఇప్పటివరకు రూ.926 కోట్ల బోనస్ చెల్లించారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తం బోనస్ రూ.1,850 కోట్లలో ఇంకా రూ.924 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేనాటికి బోనస్ చెల్లింపులు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న నిల్వలతోపాటు ఈ వారంలో వచ్చే ధాన్యం కలిపి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని పౌరసరఫరాలశాఖ అధికారులు అంచనావేస్తున్నారు. దీంతో ఖరీఫ్ ధాన్యం సేకరణ 71 లక్షల టన్నులకు చేరనుంది. ఇప్పటికే 6,500 కొనుగోలు కేంద్రాలను మూసివేయగా.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇంకా 1,800 కేంద్రాలు పనిచేస్తున్నాయి. కాగా, వానాకాలం ధాన్యం సేకరణ 71 లక్షల మెట్రిక్ టన్నులకు చేరితే సరికొత్త రికార్డు నమోదుకానుంది. ఇదే జరిగితే గత పదేళ్ల ఖరీఫ్ చరిత్రలో అత్యధిక ధాన్యం ఈ సీజన్‌లో సేకరించినట్లవుతుంది.