Share News

ఖానాపూర్‌లో బీజేపీ-బీఆర్‌ఎస్‌ పాగా

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:17 AM

ఖానాపూర్‌ మున్సిపాలిటీలో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో కొద్ది రోజులుగా కాంగ్రెస్‌....

ఖానాపూర్‌లో బీజేపీ-బీఆర్‌ఎస్‌ పాగా

  • ఒక్క ఓటుతో ‘చే’జారిన మున్సిపాలిటీ!

  • చైర్మన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ మౌనిక ఎన్నిక

  • వైస్‌ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ షోయబ్‌ హుస్సేన్‌

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఖానాపూర్‌ మున్సిపాలిటీలో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో కొద్ది రోజులుగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎట్టకేలకు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ముగిసింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ అంకం మౌనిక, వైస్‌ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ షోయబ్‌ హుస్సేన్‌లు ఎన్నికయ్యారు. ఖానాపూర్‌ బల్దియా పీఠాన్ని దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్‌ కల ఒక్కఓటుతో చెదిరిపోయింది. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 3 స్థానాల్లో, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు 4స్థానాల చొప్పున గెలుచుకోగా.. ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 12 మంది కౌన్సిలర్లు ఉన్న ఖానాపూర్‌ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఏడుగురు సభ్యులు కావాల్సి ఉంటుం ది. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో తొలి రెండు సార్లు కోరం లేక ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. దీంతో ఎన్నికల కమిషన్‌ మూడోసారి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసింది. శనివారం నిర్వహించిన చైర్మన్‌ ఎన్నిక సమయంలో గందరగోళం నెలకొనడంతో అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. ఎస్పీ జానకి షర్మిల ఎన్నిక పూర్తయ్యే వరకు ఉండి, భద్రతను పర్యవేక్షించారు. ఉదయం 11:30 గంటలకు తమ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లను తీసుకుని ఆ పార్టీల నేతలు జాన్సన్‌ నాయక్‌, రితేశ్‌ రాథోడ్‌లు వచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను ప్రారంభించారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సల ఉమ్మడి అభ్యర్థి అంకం మౌనికకు ఏడు ఓట్లు.. కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నం సత్యనారాయణకు 6ఓట్లు రావడంతో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్‌ చైర్మన్‌ పదవికి దూరమైంది. మౌనిక మునిసిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. తర్వాత నిర్వహించిన వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ల ఉమ్మడి అభ్యర్థి షోయబ్‌ హుస్సేన్‌కు 7 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి సాజిదా బేగంకు 6 ఓట్లు రావడంతో వైస్‌ చైర్మన్‌ పదవి సైతం కాంగ్రెస్‌‌కు దూరమైంది. వైస్‌ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ షోయబ్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే పటేల్‌ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల పొత్తుపై మండిపడ్డారు. ఆ పార్టీల అనైతిక పొత్తు ఎంత వరకు కొనసాగుతుందో చూస్తామన్నారు. 12 వార్డుల్లో పట్టణాన్ని సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఖానాపూర్‌ పట్టణ ప్రజల అభీష్టం మేరకే రెండు పార్టీలు కలిసి మునిసిపల్‌ పీఠాన్ని దక్కించుకున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌ నాయక్‌లు చెప్పారు.

Updated Date - Apr 06 , 2026 | 04:17 AM