Share News

బెడిసి కొట్టిన సయోధ్య

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:10 AM

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మునిసిపాలిటీలో నిన్నటి వరకూ కలిసి పదవులు పంచుకుందామనుకున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య అనూహ్యంగా బుధవారం విభేదాలు పొడసూపాయి.

బెడిసి కొట్టిన సయోధ్య

  • ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు కుదరని ఏకాభిప్రాయం

  • సోషల్‌ మీడియాలో రెండు పార్టీలు పోటాపోటీ పోస్టులు

  • కోరం లేక ఖానాపూర్‌లో 2 సార్లు ఎన్నిక వాయిదా

  • పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌

ఖానాపూర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మునిసిపాలిటీలో నిన్నటి వరకూ కలిసి పదవులు పంచుకుందామనుకున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య అనూహ్యంగా బుధవారం విభేదాలు పొడసూపాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికలపై పరస్పరం పోస్టులు పెట్టడంతో వాటి మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు నలుగురు చొప్పున కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు జత కట్టాలని నిర్ణయానికి వచ్చిన బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో మాత్రం పదవుల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరలేదు. బీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య పరస్పరం ఆరోపణలు హస్తం పార్టీకి అనుకూలంగా మారాయి. మునిసిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2 రోజులు అవకాశమిచ్చినా కోరం లేక వాయిదా పడింది. పాలక వర్గం ఎన్నికలపై అంతర్గతంగా చర్చించుకున్న బీఆర్‌ఎస్‌, బీజేపీల నిర్ణయాలు మరింత అయోమయానికి దారి తీశాయి. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ఆకుల శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. చైర్మన్‌ పదవి ఒక పార్టీ తీసుకుంటే.. మిగతా పదవులు మరో పార్టీకి వదిలేయాలని.. రెండింటిలో దేనికైనా తాము సిద్ధమేనని ప్రతిపాదించారు. ఆ వెంటనే బీఆర్‌ఎస్‌ నేత జాన్సన్‌ నాయక్‌ ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు రాథోడ్‌ రాము నాయక్‌.. బీజేపీ బహిరంగ ఆఫర్‌ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా తాళ్లపెల్లి రాజ గంగన్నను ప్రతిపాదిస్తూ.. తొలి రెండేళ్లు చైర్మన్‌ పదవి తీసుకుని, మిగతా 3 ఏళ్లు బీజేపీకి ఇస్తామన్నారు. ఒక పార్టీ చైర్మన్‌ పదవి తీసుకుంటే.. మరొకరికి వైస్‌ చైర్మన్‌ పదవి.., నాలుగు కో-ఆప్షన్‌ సభ్యుల్లో చెరో రెండు పంచుకోవడానికి సమ్మతమేనని చెప్పడంతో సోషల్‌ మీడియాలో లొల్లి మొదలైంది. రెండు పార్టీల కార్యకర్తలూ తమ పార్టీకే చైర్మన్‌ పదవి కావాలంటూ సోషల్‌ మీడియా వేదికలపై పెట్టిన పోస్టులు హల్‌చల్‌ చేశాయి. బీఆర్‌ఎస్‌ ముందుగా చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించడాన్ని బీజేపీ నేతలు తప్పు బట్టారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఒప్పందం కుదరనందు వల్లే ప్రజల్లో లబ్ధి పొందడానికి ఒకరిపై మరొకరు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడారని టాక్‌. ఒక ఎక్స్‌అఫిషీయో సభ్యుడి ఓటును కలిగి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. మారుతున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోందని సమాచారం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య మరింత దూరం పెరిగి కాంగ్రెస్‌ పార్టీ వారే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లుగా ఎన్నిక కావడం ఖాయమని చెబుతున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 05:10 AM