Share News

హైదరాబాద్‌ టు వైజాగ్‌రయ్‌.. రయ్‌!

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:17 AM

పచ్చని పొలాల మధ్య సాగిపోయే విశాలమైన రోడ్డు.. సౌర విద్యుద్దీపాలు.. కిలోమీటర్‌ దూరం వరకు నిఘా ఉంచగలిగే సోలార్‌ సీసీ కెమెరాలు..

హైదరాబాద్‌ టు వైజాగ్‌రయ్‌.. రయ్‌!

  • ఖమ్మం-దేవరపల్లి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ పనులు దాదాపు పూర్తి.. మేలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

  • మార్చి నుంచే ఒకవైపు రాకపోకలు

  • తెలుగు రాష్ట్రాల మధ్య తొలి ‘4 లేన్ల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే’

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పచ్చని పొలాల మధ్య సాగిపోయే విశాలమైన రోడ్డు.. సౌర విద్యుద్దీపాలు.. కిలోమీటర్‌ దూరం వరకు నిఘా ఉంచగలిగే సోలార్‌ సీసీ కెమెరాలు.. ఎక్కడైనా ప్ర మాదం జరిగితే వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చేలా ఆధునిక సాంకేతిక ఏర్పాట్లు.. ఇవన్నీ ‘ఖమ్మం- దేవరపల్లి నాలుగు లేన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (ఎన్‌హెచ్‌-365బీజీ)’ ప్రత్యేకతలివి. ఏపీ-తెలంగాణ మధ్య అనుసంధానాన్ని పెంచే ఈ కీలక రహదారితో హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు ప్రయాణ సమయం 4 గంటల మేర తగ్గిపోనుంది. రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయి. మేలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ రోడ్డును ప్రారంభించనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్‌ టూ వైజాగ్‌ రయ్‌.. రయ్‌..!

కేంద్రం ‘ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే’కు భారత్‌మాల పరియోజన-1 కింద 2018 మే 23న అనుమతినివ్వగా.. 2022లో పనులు మొదలయ్యాయి. ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వర కు మొత్తం 162 కిలోమీటర్ల రహదారిని రూ.4,451.87 కోట్ల వ్యయంతో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టారు. ఏపీ-తెలంగాణ మధ్య ‘4 వరుసల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే’ ఇదే మొదటిది కావడం విశేషం. రోడ్డు కోసం ఖమ్మం నుంచి తెలంగాణ సరిహద్దు వరకు 552 హెక్టార్ల భూమిని సేకరించారు. నాలుగేళ్లలోనే పనులు చివరిదశకు చేరుకున్నాయి. మార్చి చివరినాటికల్లా ఒకవైపు రోడ్డును అందుబాటులోకి తీసుకువస్తామని, మేలో పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. ఈ రహదారి తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి, విశాఖపట్నం మధ్య రాకపోకలకు అనువైన మార్గంగా మారనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్లాలంటే సూర్యాపేట-విజయవాడ మీదుగా 12 గంటలు ప్రయాణించాల్సి వస్తోంది. ఖమ్మం-దేవరపల్లి హైవే అందుబాటులోకి వస్తే 56 కిలోమీటర్ల మేర దూరం, సుమారు 4 గంటల వరకు ప్రయాణ సమయం తగ్గనున్నాయి.


ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తూ..

ఈ హైవేపై ‘అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏటీఎంఎస్‌)’ కింద ప్రతీ రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 95 సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ఇవి రెండు వైపులా సుమారు కిలోమీటర్‌ దూరం వరకు కృత్రిమ మేధ సాయంతో నిఘా ఉంచుతాయి. మార్గంలో ఎక్కడైనా ఏదైనా ప్రమాదంగానీ, మరేదైనా ఘటన గానీ జరిగితే.. వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది. ఈ సీసీ కెమెరాల మానిటరింగ్‌ కోసం తెలంగాణ పరిధిలోని కల్లూరుకు దగ్గర్లో కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఇక రాత్రిళ్లు రోడ్డుపై వెలుతురు కోసం సౌర విద్యుద్దీపాలను అమర్చుతున్నారు. సీసీ కెమెరాలకు కూడా సోలార్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడేలా ప్రతీ 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికే టోల్‌చార్జీలు చెల్లించే ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్‌ప్రె స్‌వేపై ఖమ్మం నగరానికి పక్కన ఉన్న ధంసలాపురం వద్ద రైల్వే బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. దీనికారణంగానే హైవేను ప్రారంభించలేకపోతున్నారు. ఇక ఈ రహదారిపై రోడ్డు మధ్యలో, ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మొక్కల పెంపకంతోపాటు ప్రత్యేక కళాకృతులను వేయించనున్నారు.

2.jpg

మేలో రోడ్డును అందుబాటులోకి తెస్తాం

ఖమ్మం-దేవరపల్లి రోడ్డును అత్యాఽధునిక సాంకేతికతతో నిర్మించాం. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నాం. ఖమ్మం దగ్గర్లో భారీ రైల్వే ఓవర్‌ స్టీల్‌ బ్రిడ్జి పనులు మార్చి చివరికల్లా పూర్తవుతాయి. ఆ వెంటనే ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తాం. మే మొదటివారం నాటికి రోడ్డును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తాం.

- శివశంకర్‌, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్వో, తెలంగాణ

Updated Date - Feb 26 , 2026 | 03:17 AM