ఎర్ర బంగారానికి నల్ల తామర కాటు
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:10 AM
సాగుకు ముందు ఆశాజనక ధరలతో మిర్చి సాగు చేస్తున్న రైతులు.. తీరా మార్కెట్‌కు తీసుకొచ్చే సమయానికి పతనం కావడంతో కుదేలవుతున్నారు.
సగానికి పడిపోయిన మిర్చి దిగుబడులు
ఖమ్మం మిర్చి రైతు దిగాలు
ఖమ్మం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సాగుకు ముందు ఆశాజనక ధరలతో మిర్చి సాగు చేస్తున్న రైతులు.. తీరా మార్కెట్‌కు తీసుకొచ్చే సమయానికి పతనం కావడంతో కుదేలవుతున్నారు. మూడేళ్లుగా ఏడాదికేడాది ఎర్ర బంగారంగా పేరొందిన మిర్చి సాగుకు పెరిగిపోయిన పెట్టుబడి.. అంచనా కంటే సగానికి తగ్గిన దిగుబడికి తోడు విదేశాలకు ఎగుమతి లేక ధరలు తగ్గుతున్నాయి. నల్ల తామర పురుగుతో ఐదేళ్ల క్రితం 1.50 లక్షల పై చిలుకు ఎకరాల్లో సాగు చేసిన మిర్చి గతేడాది లక్ష ఎకరాలు దాటితే.. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లోపుకే పరిమితమైంది. ఎకరానికి 25-30 క్వింటాళ్ల దిగుబడి ఆశతో రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకూ పెట్టుబడి పెడుతున్నారు. క్వింటాల్‌కు రూ.25 వేల ధరపై ఆశతో సరిగ్గా దిగుబడి వస్తే కనీసం రూ.3 లక్షలపై చిలుకు ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు. కానీ, ఏ ప్రాంత మిర్చి రైతును కదిలించినా కన్నీటి వ్యధలే. మిర్చి రైతుల్లో అత్యధికులు కౌలు రైతులే. కూలీల కొరతతో ఏపీ, ఛత్తీ్‌సగఢ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి వారికి వసతులు కల్పించడం.. అటుపై వారికి కూలీ చెల్లించడం తలకు మించిన భారమని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది సాగు తగ్గినా ఎప్పటి మాదిరే తీవ్రంగా వ్యాపించిన నల్ల తామర పురుగుతో దెబ్బ తిన్న తోటల్లో ఎకరానికి దిగుబడి 15 క్వింటాళ్లకే పరిమితమవుతోంది. ఖమ్మం జిల్లా మిర్చిని గుంటూరు, జగదల్‌పూర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, ఘజియాబాద్, పుణె, చెన్నె, కోల్‌కతా వంటి నగరాలతోపాటు ఇరుగుపొరుగు దేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే, ఇతర రాష్ట్రాల్లోనూ సాగు పెరగడంతోనూ ధర పలకడం లేదు. ఒకసారి ధర పెరిగితే.. తర్వాత ఐదేళ్లు తగ్గుతుండటంతో రైతు కుదేలవుతున్నాడు. గతంలో ఖమ్మం మార్కెట్‌కు సీజన్‌లో రోజూ 50 వేలకు పైగా మిర్చి బస్తాలు రాగా.. దిగుబడి తగ్గడంతో 30 వేల బస్తాలే వస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 2.7 లక్షల క్వింటాళ్ల మిర్చి కొనుగోలు చేశారు. ప్రతి ఏటా వ్యాపారులు 20-25 లక్షల క్వింటాళ్ల మిర్చి కొనుగోలు చేస్తారు.

తెగుళ్లతో దెబ్బ తిన్న పంట
నల్లతామర పురుగుతో 30 క్వింటాళ్ల దిగుబడిపై ఆశలు పెట్టుకుంటే సగమే దిగుబడి వచ్చింది. నల్ల తామర నివారణకు ప్రతిసారీ ఎకరాకు రూ.5,000 ఖర్చు చేసి పురుగు మందు పిచికారీ చేసినప్పుడు కళకళలాడే తోట తర్వాత దెబ్బ తింటోంది.
- సురేశ్, రఘునాథపాలెం, ఖమ్మం

మిర్చికీ ఎంఎస్‌పీ ప్రకటించాలి
మిగతా పంటల మాదిరిగానే మిర్చికి కేంద్రం క్వింటాల్‌పై 25 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలి. వాణిజ్య పంట మిర్చి సాగుకు పెట్టుబడులు అధికం. ప్రతియేటా తుఫాను, తెగుళ్లు,, తామర పురుగు వంటి ఏదో ఒక సమస్యతో నష్టపోతున్నాం. దిగుబడి రాక అప్పులు కూడా తీరడం లేదు.
- పి.వెంకన్న, గొళ్లపాడు, ఖమ్మం

ధర పెరిగితేనే రైతుకు గిట్టుబాటు
మూడేళ్లుగా ధర లేకపోగా, తామర పురుగుతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఏడాదికేడాది మిర్చి సాగు తగ్గిస్తున్నారు.. పలు నివారణ చర్యలు తీసుకున్నా తొలుత పత్తి.. తర్వాత మిర్చి.. అటుపై మామిడిపూతపై ప్రభావం చూపుతున్న నల్ల తామర వల్ల పంట దిగుబడులు తగ్గుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇటీవల ధర ఆశాజనకంగా ఉన్నా దిగుబడుల్లేక రైతుకు మిర్చి సాగు గిట్టుబాటు కావట్లేదు. ధర పెరిగితేనే రైతుకు గిట్టుబాటవుతుంది.
- ఖమ్మం జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎంవీ మధుసూధన్