ఖమ్మం బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం?
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:20 AM
ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు నెలల క్రితం ఓ కామాంధుడి దుశ్చర్యకు గురైన 12 ఏళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది.
రెండు నెలల క్రితం అత్యాచార యత్నం చేసి చంపబోయిన ఓ కామాంధుడు
నాటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స
ఖమ్మం క్రైం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు నెలల క్రితం ఓ కామాంధుడి దుశ్చర్యకు గురైన 12 ఏళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. రోజూ ఫిజియోథెరపీ చేసే ఓ మహిళా వైద్యురాలు శనివారం రాకపోవడంతో మరో ఫిజియోథెరపీ వైద్యుడు సేవలందిస్తుండగా ఆ బాలిక ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. రక్తనాళాల ద్వారా గుండెకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడడంతో సదరు బాలికను వైద్యులు వెంటనే ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ బాలిక తన కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉందని సమాచారం. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బాలిక వేసవి సెలవులకు ఖమ్మం నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న తన తాత ఇంటికి వెళ్లగా.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే గౌస్‌పాషా అనే దుర్మార్గుడు జూన్ ఆరో తేదీన సదరు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో తాను చేసిన పని ఎక్కడ బయటపడుతుందోనని చిన్నారి అని కూడా చూడకుండా ఆ బాలికను మూడో అంతస్తు పైనుంచి కిందకు తోసేశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలికను తొలుత ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాదులోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన మూడు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 9న వెలుగులోకి రాగా.. తీవ్ర సంచలనం రేపింది.