పోలీసు కస్టడీకి లైంగికదాడి నిందితుడు?
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:30 AM
ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, భవనం నాలుగో అంతస్తుపై నుంచి తోసేసిన ఘటనలో నిందితుడు మహమ్మద్ గౌస్‌పాషాను ఖమ్మం టూటౌన్ ...
నిమ్స్‌లో ఖమ్మం బాలికకు మంత్రి దామోదర, కవిత పరామర్శ
బూర నర్సయ్యగౌడ్, జాజుల కూడా
ఖమ్మం క్రైం/నిమ్స్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, భవనం నాలుగో అంతస్తుపై నుంచి తోసేసిన ఘటనలో నిందితుడు మహమ్మద్ గౌస్‌పాషాను ఖమ్మం టూటౌన్ పోలీసులు శనివారం తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 6న జరిగిన ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండురోజుల తరువాత స్పృహలోకి వచ్చి జరిగిన విషయం చెప్పడంతో గౌస్‌పాషా అకృత్యం వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన వెంటనే నిందితుడిని ఖమ్మం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా, కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతితో నిందితుడిని శనివారం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారని, ఆదివారం కూడా విచారణ కొనసాగుతుందని సమాచారం. బాలికపై దారుణానికి పాల్పడిన గౌస్‌పాషాను కఠినంగా శిక్షించాలంటూ పలు రాజకీయ పార్టీలు, ప్రజా, యువజన, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. కాగా, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం పరామర్శించారు. వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాలిక ఆరోగ్యంపై ఆరా తీసిన ఆయన.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సమత, మెడికల్ సెల్ కో-కన్వీనర్ రష్మి, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ తదితరులు కూడా బాధిత బాలికను పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తో మాట్లాడి బాలిక ఆరోగ్యంపై ఆరా తీశారు. నిందితుడు మహమ్మద్ గౌస్‌ను బహిరంగంగా ఉరితీయాలని జాజుల డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.