Share News

అన్ని విధాలా ఆదుకుంటాం!

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:37 AM

ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 15 రోజుల వయస్సున్న ఓ శిశువు చేయిని భుజం వరకు తొలగించిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది.

అన్ని విధాలా ఆదుకుంటాం!

  • శిశువుకు మెరుగైన వైద్యం అందిస్తాం

  • విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు

  • శిశువు చేయి తొలగింపు ఘటన..బాధితులకు ఖమ్మం కలెక్టర్‌ భరోసా

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 15 రోజుల వయస్సున్న ఓ శిశువు చేయిని భుజం వరకు తొలగించిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొంది. శిశువు చేయి తొలగింపు ఘటనపై ‘‘నెలలు తక్కువని వస్తే... వికలాంగుడిగా మార్చారు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆరా తీసినట్టు సమాచారం. జరిగిన సంఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను పంపించాలంటూ సీఎంవో నుంచి ఖమ్మం కలెక్టర్‌ దివాకరకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో శిశువు తల్లి తలపాటి రేణుక తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి కలెక్టర్‌ దివాకరను ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం కలిశారు. చేయి తొలగించిన చిన్నారిని చూసి చలించిపోయిన కలెక్టర్‌.. మీకేం కావాలమ్మా అని రేణుకను అడిగారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డకు, తమకు తీరని నష్టం జరిగిందని, వైద్యుల తప్పు వల్ల తన బిడ్డ వికలాంగుడయ్యాడని రేణుక కన్నీటి పర్యంతమైంది. దాంతో రేణుకను ఓదార్చిన కలెక్టర్‌ దివాకర.. ప్రభుత్వపరంగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆమెకు హామీ ఇచ్చారు. జరిగిన సంఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక, గాంగ్రీన్‌ (సెప్టిక్‌) శిశువు మెదడుకు సోకుతుందేమోనని ఆందోళనగా ఉంది శిశువు తల్లి రేణుక, పెద్దమ్మ విజయకుమారి కలెక్టర్‌కు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ శిశువుకు ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, ఈ ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. తక్షణమే ఈ సంఘటనపై విచారణ నిర్వహించి సమగ్ర నివేదికను అందించాలంటూ ఖమ్మం జిల్లా వైద్యాధికారిని ఆదేశించింది.

Updated Date - Jun 02 , 2026 | 04:37 AM