CPI Centenary Celebration: ఎరుపెక్కిన ఖమ్మం గుమ్మం
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:42 AM
ఒకప్పటి కామ్రేడ్ల కోట ఖమ్మం సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ కోసం మళ్లీ ఎరుపెక్కింది. ఖమ్మం వీధులు, జిల్లా నలువైపులా ప్రధాన రహదారులు...
నేడు సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ
ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి,హాజరుకానున్న ఖమ్మం జిల్లా మంత్రులు
కమ్యూనిస్టుల సత్తా చాటుతాం: కూనంనేని
ఖమ్మం, జనవరి 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఒకప్పటి కామ్రేడ్ల కోట ఖమ్మం సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ కోసం మళ్లీ ఎరుపెక్కింది. ఖమ్మం వీధులు, జిల్లా నలువైపులా ప్రధాన రహదారులు ఎర్ర జెండాలతో నిండిపోయాయి. ఇక్కడి ఎస్సార్‌బీజీఎన్నార్ కళాశాల మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సీపీఐ నాయకులు, వివిధ సంఘాల జాతీయ, రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇక సభ సందర్భంగా ఖమ్మంలో నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. జనసేవాదళ్, రెడ్‌షర్ట్ వలంటీర్లు కవాతు చేయనున్నారు. శ్రీశ్రీ సర్కిల్, నయాబజార్ కళాశాల, పెవిలియన్ గ్రౌండ్ నుంచి వేర్వేరుగా మూడు ప్రజాప్రదర్శనలు నిర్వహించి ఎస్సార్ బీజీఎన్నార్ కాలేజీ వద్ద ఐక్య ప్రదర్శన జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఇక ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు సీపీఐ జాతీయ సమితి సమావేశాలను ఖమ్మంలోనే నిర్వహించనున్నారు. శతాబ్ది ముగింపు సభకు జన సమీకరణ, ప్రజాప్రద ర్శన చేపట్టి కమ్యూనిస్టుల సత్తా చాటుతా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మిత్రపక్షంగా ఉన్న క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఈ సభకు ఆహ్వానించామని వెల్లడించారు.