భారీగా తరలివచ్చిన రైతులు
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:55 AM
మ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో రైతులు, జనం హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగానికి మంచి స్పందన కనిపించింది.
రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించిన సీఎం
ఖమ్మం, జూలై 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో రైతులు, జనం హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగానికి మంచి స్పందన కనిపించింది. మధ్యాహ్నం మూడున్నర సమయంలో సీఎం సభాస్థలికి చేరుకున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు సభలో పాల్గొన్నారు. సభ వేదికగా రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ప్రసంగించారు. సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా హాజరయ్యారని.. ఇది అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి రైతు ఆశీర్వాద సభ వేదికగా రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించారు. ఔర్ ఏక్‌బార్ కాంగ్రెస్ సర్కార్.. ఇదే మన నినాదం, ఇక ఎన్నికలవైపు కదలాలంటూ పిలుపు ఇచ్చారు. కాగా, సభలో డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగిస్తుండగా ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్ వద్ద షార్ట్ సర్క్య్డూట్ జరిగి మంటలు, పొగలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఆందోళనతో పరుగులు పెట్టారు. పోలీసులు తక్షణమే అగ్నిమాపక పరికరాన్ని తీసుకొచ్చి ఆర్పేశారు. నిజానికి అధికారులు ఎల్‌ఈడీ స్ర్కీన్లకు దూరంగా ఉండాలంటూ ప్రజల కోసం పలుమార్లు ప్రకటించారు. కానీ కొందరు ఎల్‌ఈడీ స్ర్కీన్లకు ఏర్పాటు చేసిన పైపుల పైకెక్కి కూర్చోవడం గమనార్హం.