కోలుకుంటున్న ఖమ్మం బాలిక
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:44 AM
ఖమ్మం జిల్లాలో అత్యాచారం, హత్యాయత్నానికి గురై తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ...
నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్
అధైర్య పడకండి.. అండగా ఉంటాం
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు
బాలిక కుటుంబానికి తుమ్మల భరోసా
ఆస్పత్రిలో బాధితురాలికి పరామర్శ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/నిమ్స్/ఖమ్మం రూరల్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో అత్యాచారం, హత్యాయత్నానికి గురై తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, బాలిక క్రమంగా కోలుకుంటోందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ పేర్కొన్నారు. బాలిక వెన్నుముక, పక్కటెముకలు విరిగాయని, ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిపారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి, ప్రత్యేక వైద్య బృందంతో బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. బాలికకు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నామని, బాలిక తల్లిదండ్రులకు ప్రత్యేక వసతి కల్పించామని తెలిపారు. బాధిత బాలికను గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్‌తో పాటు వైద్యులతో మాట్లాడిన ఆయన.. బాలికకు అందుతున్న వైద్యం గురించి ఆరాతీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి అధైర్య పడొద్దని, అండగా ఉంటానని, ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ధైర్యం చెప్పారు. బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. బాలిక పట్ల అతికిరాతకంగా ప్రవర్తించిన నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితుడు మహ్మద్ పాషాను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలికను, ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందనగౌడ్, బండి అపర్ణ, చందన మారిపల్లి పరామర్శించారు.
రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతలు: హరీశ్‌రావు
12 ఏళ్ల బాలికపై జరిగిన పైశాచిక అత్యాచారం రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతలకు సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రాణాపాయ స్థితిలో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారికి ఉచిత వైద్యం అందించకుండా, ఆ పేద కుటుంబంతో బయట మందులు కొనిపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. బాధిత బాలికను మాజీ మంత్రులు హరీశ్‌రావు, సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. బాధితులకు అండగా నిలిచి.. అఘాయిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిపైనే అక్రమ కేసులు పెడతామని ఖమ్మం పోలీసులు బెదిరించడం అత్యంత దుర్మార్గమన్నారు. బాలిక కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు.