ఖమ్మంలో క్వింటాల్ మిర్చి రూ.19,700
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:26 AM
ఈ ఏడాది ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తేజ రకం మిర్చి భారీగా తరలి వస్తోంది. మార్కెట్‌లో క్వింటాల్ ధర నిలకడగా కొనసాగుతోంది...
మార్కెట్‌కు భారీగా తేజ రకం మిర్చి తరలింపు
వరంగల్‌లో వండర్‌హాట్ క్వింటాల్ రూ.31,700
ఖమ్మం మార్కెట్/ పోచమ్మ మైదాన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తేజ రకం మిర్చి భారీగా తరలి వస్తోంది. మార్కెట్‌లో క్వింటాల్ ధర నిలకడగా కొనసాగుతోంది. బుధవారం క్వింటాల్ మిర్చి ధర రూ.19,700 జెండా పాటగా వ్యాపారులు నిర్ణయించారు. నాణ్యత ఆధారంగా క్వింటాల్‌పై రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు కొనుగోలు చేశారు. తాలు మిర్చి క్వింటాల్‌కు రూ.8,000-11,800 పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం 30 వేల తేజ రకం మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్‌లో భారీగా మిర్చి రావడం ఇదే తొలిసారి. సోమ, మంగళవారాల్లో 15 వేల నుంచి 20 వేల బస్తాలొచ్చాయి. మేడారం జాతర సెలవుల తర్వాత సోమవారం నుంచి మార్కెట్‌లో క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మంలో మిర్చి కొనుగోళ్లను మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేశ్, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ ఆంజనేయులు తదితరులు పర్యవేక్షించారు. ఇక వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 80-వండర్‌హాట్ మిర్చి ధర రూ.37,100 పలికింది. ఈ మిర్చిని జయశంకర్-భూపాలపల్లి జిల్లా నీలంపల్లి గ్రామ రైతు రేగ వినోద్ పండించారు. గత నాలుగేళ్లలో మిర్చికి పెద్దమొత్తంలో ధర పలుకడం ఇదే తొలిసారని మార్కెట్ అధికారులు తెలిపారు.