వక్ఫ్ ఆస్తుల వివాదంతోనే అంతం!
ABN , Publish Date - May 30 , 2026 | 04:17 AM
వక్ఫ్ ఆస్తుల వివాదంతో కక్షగట్టారు.. 13 ఏళ్లుగా తమకు తరచూ అడ్డుతగులుతున్నాడంటూ రగిలిపోయారు.. పక్కాగా ప్లాన్ చేసి, రూ.15 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించారు..
అడ్వొకేట్ ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో వీడిన మిస్టరీ
13 ఏళ్లుగా తమకు అడ్డొస్తున్నాడని కక్ష
రూ.15 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం
ఐదు నెలలు రెక్కీ చేసి పక్కా ప్లాన్‌తో హత్య
స్కార్పియోతో ఢీకొట్టి.. ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
దర్యాప్తులో వ్యవహారమంతా తేల్చిన పోలీసులు
ప్రధాన నిందితులు ముజాహిద్ ఆలంఖాన్,మహబూబ్ ఆలంఖాన్ సహా ఏడుగురు అరెస్టు
హైదరాబాద్ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ ఆస్తుల వివాదంతో కక్షగట్టారు.. 13 ఏళ్లుగా తమకు తరచూ అడ్డుతగులుతున్నాడంటూ రగిలిపోయారు.. పక్కాగా ప్లాన్ చేసి, రూ.15 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించారు.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్‌లో నాంపల్లి పోలీ్‌సస్టేషన్ పరిఽధిలో ఈ నెల 23న జరిగిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ (63) హత్య కేసు మిస్టరీ ఇది. ఆయనతో విభేదాలున్న ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్ (కుమారుడు, తండ్రి) ఈ హత్య చేయించినట్టు తేల్చి.. వారితోపాటు మరో ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ వివరాలను వెల్లడించారు. ఆ వివరాల మేరకు..
వక్ఫ్ ఆస్తుల వివాదంతో మొదలై..
ముజాహిద్ ఆలంఖాన్‌కు, ఖాజా మొయిజుద్దీన్‌కు మధ్య మలక్‌పేట, లక్డీకాపూల్‌లోని వక్ఫ్‌బోర్డు ఆస్తుల విషయంలో 2013 నుంచి గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం సివిల్, క్రిమినల్, వక్ఫ్ ట్రిబ్యునల్ కేసులపై పోరాడుతున్నారు. ఈ క్రమంలో మొయిజుద్దీన్‌ను అడ్డు తొలగించుకోవాలని ముజాహిద్, మహబూబ్ నిర్ణయించుకున్నారు. తమకు సన్నిహితులైన హాసన్ అలీ, మునీర్, కిషన్ అలియాస్ పప్పూతో రూ.15 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. వారు వినయ్, విక్రమ్, అభిజిత్ అలియాస్ నాని, వినయ్, విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటు, మణిదీప్ అలియాస్ పోగో నానిలను రంగంలోకి దింపారు. వారు ముజాహిద్ ఆలంఖాన్ నుంచి రూ.2 లక్షలు తీసుకుని ఒక స్కార్పియో వాహనం కొనుగోలు చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి మొయిజుద్దీన్ ఇల్లు, ఆయన తరచూ వెళ్లే ఇతర ప్రాంతాల్లో రెక్కీ చేశారు. మే 23న ఉదయం 5:45 గంటల సమయంలో నిజాం క్లబ్‌లో స్విమ్మింగ్ కోసమని ఇంట్లోంచి బయటికి వచ్చిన మొయిజుద్దీన్‌ను స్కార్పియోతో వేగంగా ఢీకొట్టి పరారయ్యారు. తీవ్ర గాయాలైన మొయిజుద్దీన్ చికిత్స పొందుతూ మరణించారు. తొలుత దీనిని ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీలను, ఇతర అంశాలను పరిశీలించి నంబర్ ప్లేట్ లేని పచ్చ రంగు స్కార్పియోలో కాపు కాసి, ఢీకొట్టినట్టు గుర్తించారు. దీనిని హత్యకేసుగా మార్చారు. ఆ స్కార్పియో ప్రయాణించిన మార్గాలు, అందులో నుంచి దిగిన వ్యక్తులను నగరంలోని పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. నిందితులపై నిఘాపెట్టారు. కిషన్ అలియాస్ పప్పూను ఈ నెల 27న హరియాణాలోని పానిపట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వివరాలు సేకరించి.. ముజాహిద్, మెహబూబ్, అభిజిత్ అలియాస్ నాని (స్కార్పియో నడిపి ఢీకొట్టిన వ్యక్తి), వినయ్ (హత్యకు వాహనాన్ని సమకూర్చిన వ్యక్తి), విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటు (ప్రణాళికలో పాల్గొని నిందితులను సమన్వయం చేసిన వ్యక్తి), మణిదీప్ అలియాస్ పోగో నాని (హత్య జరిగిన సమయంలో వాహనంలో ఉన్న వ్యక్తి)లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మునీర్, హాసన్ ఆలీ పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
గోదావరి బోర్డుకు 12 ఏళ్లు
గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఏర్పడి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బోర్డులో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు నీటిపారుదలశాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పద్మ దోర్జే గ్యాంబ, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ శుభ్రాంసు బిశ్వాస్, తెలంగాణ అంతరాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ కె.ప్రసాద్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం ప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. 2014 మే 29న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం గోదావరి బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.