Share News

ఫిబ్రవరిలో ఉప ఎన్నిక

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:31 AM

అనర్హత వేటుకు సంబంధించి దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్‌ చేయడంతో ఖైరతాబాద్‌ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైంది. దానం నాగేందర్‌పై అనర్హత కేసుకు సంబంధించిం హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయిందని, ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్‌కు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ లేఖ పంపాల్సి ఉంది

ఫిబ్రవరిలో ఉప ఎన్నిక
image

ఫిబ్రవరిలో ఉప ఎన్నిక

  • యూపీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్‌కూ నిర్వహించే అవకాశం

  • ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా నేడు ఈసీకి లేఖ పంపనున్న స్పీకర్‌..!

  • కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందరే..!

  • మంత్రివర్గంలో చోటు కల్పించే యోచనలో కాంగ్రెస్‌

  • బీజేపీ నుంచి చింతల,

బి.ఇంద్రసేన్‌రెడ్డి తదితరుల పేర్లు

హైదరాబాద్‌/సంగారెడ్డి సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అనర్హత వేటుకు సంబంధించి దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్‌ చేయడంతో ఖైరతాబాద్‌ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైంది. దానం నాగేందర్‌పై అనర్హత కేసుకు సంబంధించిం హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయిందని, ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్‌కు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ లేఖ పంపాల్సి ఉంది. ఈమేరకు లేఖను స్పీకర్‌ శుక్రవారం ఈసీకి పంపనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు లైన్‌ క్లియర్‌ కానుంది. అయితే రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నవంబరు 9న పూర్తి కానుంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయితే కానీ.. ఉప ఎన్నిక నిర్వహించడానికి వీలుండదని ఎన్నికల సంఘం అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఖైరతాబాద్‌ ఉప ఎన్నికనూ ఈసీ నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం.. వచ్చే సార్వత్రిక ఎన్నికలనూ ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ.. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపే ప్రాతిపదికన అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తున్నాయి.


అనర్హత వేటే దానంకు కలిసొస్తుందా?

2023 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన దానం నాగేందర్‌.. ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారంగా అయితే 2028 నవంబరులో జరుగుతాయి. ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా.. ఎమ్మెల్యే పదవి రెండేళ్ల పాటే ఉంటుంది. పునర్విభజన జరిగితే.. నియోజకవర్గం ఎన్ని ముక్కలవుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిత్వం కోసం దానంతో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు ఎవరూ పోటీ పడేందుకు ఆసక్తి చూపట్లేదు. దీంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. కాంగ్రె్‌సలో చేరిన దగ్గరి నుంచీ దానం నాగేందర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతూనే ఉన్నా.. అది ఇంతవరకు కార్యరూపమైతే దాల్చలేదు. ఆయనపై అనర్హత కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల ఈ అంశాన్ని అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికలో గెలిస్తే నాగేందర్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న సంకేతం ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు ముందే కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించాలన్న ప్రతిపాదనా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా అనర్హత వేటు అంశం.. దానంను మంత్రివర్గం రేసులోకి తీసుకువచ్చిందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తలసాని సాయికిరణ్‌!

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు.. తలసాని సాయికిరణ్‌ పేరును ఆ పార్టీ ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం శ్రీనివాస్‌ యాదవ్‌.. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరో వైపు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం కోసం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, పార్టీ నేత మన్నె గోవర్ధన్‌ రెడ్డి తదితరులు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


బీజేపీ నుంచి ముగ్గురు ఆశావహులు!

2014 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి బీజేపీ తరఫున గెలిచిన చింతల రామచంద్రారెడ్డి.. మళ్లీ ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే 2018, 2023 ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పార్టీ సీనియర్‌ నేత బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మహిళా కోటాలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరి కీర్తిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఉప ఎన్నికలో యువనాయకత్వానికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలోనూ ఆ పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ..

ఉప ఎన్నికపై చర్చ!

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో గురువారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ అయ్యారు. వీరి ఽమద్య ప్రధానంగా ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం

Updated Date - Sep 25 , 2026 | 06:31 AM