Share News

13న మూసీపై కీలక సమావేశం

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:36 AM

మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రజలకు, పలు రంగాల్లోని ప్రముఖులకు కీలక అంశాలను ప్రభుత్వం తెలియజేయనుంది.

13న మూసీపై కీలక సమావేశం

  • మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులతో

  • జరిగే అభివృద్ధిపై ప్రజంటేషన్‌.. పలువురు ప్రముఖులకు ఆహ్వానం

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రజలకు, పలు రంగాల్లోని ప్రముఖులకు కీలక అంశాలను ప్రభుత్వం తెలియజేయనుంది. ఇందుకోసం మార్చి 13న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌ వేదికగా సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్‌లో ఆయా ప్రాంతాలతో పాటు రాష్ట్రానికి కలిగే లబ్ధి, జరగబోయే అభివృద్ధి గురించి ఆ సమావేశంలో కూలంకుషంగా వివరించనున్నట్టు తెలిసింది. ‘గాంధీ సరోవర్‌’ ప్రాజెక్టుతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు, అపార్ట్‌మెంట్ల వాసులు తమ ఇళ్లను కోల్పోవాల్సి వస్తున్న నేపథ్యంలో ప్రజలకు పూర్తి వివరాలను తెలపాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు అంటున్నాయి. మూసీ ప్రాజెక్టు మొదటి దశను దాదాపు రూ.4,500 కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వం చేపట్టనుంది. మూసీపై నిర్వహించే ఈ కీలక సమావేశానికి సీఎం రేవంత్‌ హాజరుకానున్నారు. అలాగే మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యే, ఎమెల్సీ, ఎంపీలతో పాటు మీడియాను కూడా ఆహ్వానించనున్నారు. మీడియా ద్వారా లైవ్‌ టెలికాస్ట్‌ విధానంలో రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాజెక్టు వివరాలను తెలియజేయనున్నట్టు తెలిసింది.

Updated Date - Mar 03 , 2026 | 03:36 AM