Share News

హోంవర్క్‌ లేదు.. ఒత్తిడి ఉండదు!

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:24 AM

ఫిన్లాండ్‌లో విద్యార్థులకు హోం వర్క్‌లు ఉండవు.. ఒత్తిడి ఎరుగరు.. పరీక్షల భయమే లేదు.. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావిధానంగా పేరుగాంచింది.

హోంవర్క్‌ లేదు.. ఒత్తిడి ఉండదు!

  • 9వ తరగతి వరకు పరీక్షలు లేనే లేవు

  • ఆరేళ్లు నిండిన తర్వాతే అడ్మిషన్లు

  • బోధన నైపుణ్యాలుంటేనే టీచరు పోస్టు

  • ఫిన్లాండ్‌లో తెలంగాణ టీచర్లు గుర్తించిన అంశాలివీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఫిన్లాండ్‌లో విద్యార్థులకు హోం వర్క్‌లు ఉండవు.. ఒత్తిడి ఎరుగరు.. పరీక్షల భయమే లేదు.. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావిధానంగా పేరుగాంచింది. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని తరచూ పేర్కొనే సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇక్కడి ఉపాధ్యాయులను క్షేత్ర స్థాయి పర్యటన కోసం ఫిన్లాండ్‌ పంపారు. 24 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు విద్యాశాఖ ఉన్నతాధికారులు కలిపి మొత్తం 30మంది ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 20న అక్కడికి చేరుకున్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా నేతృత్వంలో వెళ్లిన బృందం నాలుగు రోజుల్లో వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించింది. అక్కడి అధికారులతో సమావేశమైంది. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌ విద్యావిధానంలో తెలంగాణ ప్రతినిధుల బృందం పలు కీలక అంశాలను గుర్తించింది.

పాఠాలతోపాటు జీవన నైపుణ్యాలు

ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన దేశం ఫిన్లాండ్‌. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించడం అక్కడి ప్రత్యేకత. ఫిన్లాండ్‌లో పాఠ్య ప్రణాళిక ఎంతో సరళంగా, జీవన నైపుణ్యాలను పెంపొందించే విధంగా రూపొందించారు. విద్యార్థులు పాఠశాలకు రావడాన్ని ఆనందంగా భావిస్తూ, వివిధ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. అక్కడి ఉపాధ్యాయులు అత్యంత అర్హత కలిగినవారు. భారత్‌లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల తరహాలో అక్కడ ఉపాధ్యాయుల ఎంపిక విధానం ఉంటుంది. ప్రాథమిక పాఠశాల టీచర్‌ కావాలన్నా.. మాస్టర్స్‌ డిగ్రీతో పాటు బోధన శిక్షణలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న డిగ్రీ తప్పనిసరి. టీచర్ల ఎంపిక జాతీయ, రాష్ట్రస్థాయిలో కాకుండా.. స్థానిక సంస్థలు, స్థానిక పాఠశాలలే ఎంపిక చేస్తాయి. అక్కడి విద్యా విధానంలో మరో ముఖ్య అంశం మాతృభాషలో బోధన. ఫిన్లాండ్‌ జనాభా 56లక్షలు. 84-90శాతం మంది మాతృభాషలో ఫిని్‌షలో మాట్లాడతారు. 5శాతం మంది స్వీడి్‌షలో మాట్లాడతారు. అయితే, అక్కడ రెండు భాషలను అధికారికంగా గుర్తించారు. విద్యార్థి మాతృభాషలోనే విద్యాబోధన ఉంటుంది. ఉపాధ్యాయుల నియామక సమయంలోనే మాతృభాష విద్యా సామరాథ్యన్ని అంచనా వేస్తారు. ఆరేళ్లు దాటిన పిల్లలకే పాఠశాలల్లో అడ్మిషన్లు ఉంటాయి. 98శాతం పాఠశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండడం వల్ల విద్యా ప్రమాణాల్లో ఏకరూపత ఉంది. మధ్యాహ్న భోజనం అమలు చేయడంతోపాటు విద్యార్థులకు తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ 9వ తరగతి వరకు ఎలాంటి పరీక్షలు ఉండకపోవడం మరో ప్రత్యేక అంశం. అలాగే, ప్రతి 45 నిమిషాల తరగతి తర్వాత 15నిమిషాల విరామం ఇస్తుండడం గమనార్హం. విద్యార్థులు ఏం నేర్చుకోవాలనే దాని కంటే ఎలా నేర్చుకోవాలనే దానిపై దృష్టి పెడుతున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, సృజనాత్మకత పెంపొందుతుంది.

Updated Date - Apr 27 , 2026 | 05:24 AM