Deputy CM Bhatti Vikramarka: బీఆర్‌ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావట్లేదు?
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:16 AM
బీఆర్‌ఎస్ సభ్యులకు ఇబ్బంది అయిన రోజున శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.. సరే! మిగతా రోజుల్లోనూ వారు సభకు ఎందుకు రావట్లేదు..
ఉపాధి పథకంపై చర్చ వారికి ముఖ్యం కాదా?: భట్టి
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):‘‘బీఆర్‌ఎస్ సభ్యులకు ఇబ్బంది అయిన రోజున శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.. సరే! మిగతా రోజుల్లోనూ వారు సభకు ఎందుకు రావట్లేదు?’’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు, పథకాన్ని నిర్వీర్యం చేయడంపై చర్చ వారికి ముఖ్యం కాదా అని నిలదీశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. శాసనసభలో అన్ని అంశాలపైనా చర్చించాలని బీఆర్‌ఎస్ పార్టీ పట్టు పట్టిందని, వారి కోరిక మేరకు తాము అన్ని అంశాలపైనా చర్చ పెడుతున్నామని చెప్పారు. పాలమూరు - రంగారెడ్డిపైన చర్చ పెడితే వారు పారిపోయారన్నారు. సభ ఎన్ని రోజులు నడపాలన్నది స్పీకర్ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు.
10 సమీకృత ‘సబ్ రిజిస్ట్రార్’ భవనాలకు నెలాఖరులోగా శంకుస్థాపన: పొంగులేటి
లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంస్కర ణలు అమలు చేయడంతోపాటు ఆధునిక సౌకర్యాలతో మూడు దశల్లో 94 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోగా మొదటి దశలో పది సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. మండలిలో సభ్యుడు ఏవీఎన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 94 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. 50 ప్రభుత్వ భవనాల్లో ఉన్నట్టు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ అప్పులన్నీ బీఆర్‌ఎస్ హయాంలో చేసినవే: దుద్దిళ్ల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. జీహెచ్‌ఎంసీ కోసం ఎలాంటి అప్పులు తీసుకోలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జీహెచ్‌ఎంసీ అప్పుల గురించి అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి ఉన్న అప్పులన్నీ బీఆర్‌ఎస్ హయాంలో చేసినవేనని స్పష్టం చేశారు. 2025 డిసెంబరు 31 నాటికి జీహెచ్‌ఎంసీ బకాయి ఉన్న రుణం రూ.4,717 కోట్లు అని వివరించారు. గత 12 నెలల్లో రుణ మొత్తం పెరగలేదన్నారు.
76 ఇంటిగ్రేడెట్ గురుకులాలకు టెండర్లు: దామోదర
రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఇప్పటికే 79 గురుకులాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 76 భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, 12 భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మరో 6 స్కూళ్ల కోసం స్థలాల ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఒక్కో భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి జవాబు ఇచ్చారు. 2027 జూన్ కల్లా 70 గురుకులాల భవనాల నిర్మాణం పూర్తవుతుందని, 2028 జూన్ కల్లా మరో 9 గురుకుల భవనాలు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.
కేరళ స్థాయిలో పర్యాటక అభివృద్ధి: జూపల్లి
కేరళ స్థాయిలో తెలంగాణలో పర్యాటక అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. గతంలో పర్యాటక రంగానికి పాలసీ లేకపోవడంతోనే ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన పర్యాటక విధానం తెచ్చామని చెప్పారు. పర్యాటక రంగాన్ని పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షి్‌ప(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయడానికి వీలుగా, దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాయితీలు ఇస్తున్నామని తెలిపారు.
పట్టణాల్లోనూ ఇందిరమ్మ చీరల పంపిణీ: సీతక్క
గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల్లో ఉన్న 67లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని, మార్చి 1 నుంచి పట్టణ ప్రాంతాల్లోని సంఘాల మహిళలందరికీ చీరలు అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు మరో 40లక్షల చీరలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.