Kesslapur Nagoba Jatra Begins: నేటి నుంచి కేస్లాపూర్ నాగోబా జాతర
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:11 AM
రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం రాత్రి 10 గంటలకు నిర్వహించే....
ఆదివాసీల పండుగకు సర్వం సిద్ధం
25 వరకు కొనసాగనున్న జాతర
ఇంద్రవెల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం రాత్రి 10 గంటలకు నిర్వహించే మహాపూజలతో ఈ జాతర ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, ఏడు రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర అంకురార్పణ జరుగుతుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. జాతరలో భాగంగా ఈనెల 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదేరోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్ పూజలతో పాటు మహిళలు విశేషంగా పాల్గొనే భాన్ దేవత పూజలు జరుగుతాయి. 22న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం 23న భేతల్ పూజలు, మండ గాజిలింగ్ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగిసినప్పటికీ, భక్తుల రద్దీ మాత్రం ఈనెల 25 వరకు కొనసాగుతుంది.