కేరళలో యూడీఎఫ్ సెంచరీ ఖాయం: పొంగులేటి
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:06 AM
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ 100కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్ర జ్యోతి): కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ 100కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆడూరు, అరుణ్‌ములని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వయనాడ్‌తో అనుబంధం గల కాంగ్రెస్ అగ్రనేతలు రాహూల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచారంతో యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల మనోభావాలు స్పష్టమయ్యాయని, ఇప్పుడు అదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత పదేళ్ల పాలనలో ఎల్‌డీఎఫ్ విఫలమైందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏని ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూడీఎఫ్ మాత్రమే కేరళను అభివృద్ధి పథంలో నడిపించగలదని అన్నారు.