Share News

మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:33 AM

భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో బీజేపీ తనకు నచ్చిన సంస్కృతినే ప్రజలపై రుద్దుతోంది. గంగా నదీ తీర సంస్కృతిని మలబార్‌ తీరానికి(కేరళకు) బలవంతంగా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.....

మహిళలకు 50 శాతం  రిజర్వేషన్‌ ఇవ్వాలి

  • అన్ని రంగాల్లోనూ కేటాయించాలి.. అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది

  • జీరామ్‌జీతో మహిళల ఉపాధికి ముప్పు

  • కేరళలో మహిళల ఉపాధి కోసం ‘షీ’

  • ఉత్తరాది సంస్కృతిని కేరళపై రుద్దేందుకుబీజేపీ ప్రయత్నించడం.. ప్రమాదకరం

  • ఆంధ్రజ్యోతితో ఇంటర్వ్యూలో కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి బిందు

  • ఐద్వా 14వ మహాసభలకు హాజరు

హైదరాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ‘‘భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో బీజేపీ తనకు నచ్చిన సంస్కృతినే ప్రజలపై రుద్దుతోంది. గంగా నదీ తీర సంస్కృతిని మలబార్‌ తీరానికి(కేరళకు) బలవంతంగా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది’’ అని కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌. బిందు అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో 50ు రిజర్వేషన్లను కల్పిస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉపాధి చట్టం(వీబీ-జీరామ్‌జీ)తో మహిళలకు ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో మహిళలకు సాంకేతిక విద్య అందించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘షీ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఐద్వా 14వ మహా సభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆమె ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు.

కేరళలో మహిళల ఉపాధి కోసం ప్రత్యేక పథకాలు ఏమైనా ఉన్నాయా?

కేరళ రాష్ట్రం బాలికల విద్యకు మొదటి నుంచీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారిలో బాలికల వాటా 53ు ఉంది. ఇక మహిళలకు ఉపాధి కోసం ‘షీ’ అనే పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నాం. ఇది ఉన్నత విద్యా శాఖ పర్యవేక్షణలో ఉంది. ఈ కార్యక్రమం ద్వారా బాలికలకు సాంకేతిక విద్యలో శిక్షణ అందిస్తున్నాం. తద్వారా వారి ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. మహిళలు ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ రంగాల్లో ముందుకు రావడానికి ఇది దోహదపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో దీన్ని అమలు చేస్తున్నాం.


మహిళా సాధికారిత కోసం కేరళ అమలు చేస్తున్న కార్యక్రమాలేంటి?

మహిళా సాధికారితలో కేరళ దేశానికే ఆదర్శంగా ఉంది. విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, స్వయం ఉపాధి రంగాల్లో నమూనాగా ఉంది. కుడుంబ శ్రీ ఉద్యమం(పొదుపు సంఘాలు) ద్వారా మహిళలకు నాయకత్వ లక్షణాలు పెరిగాయి. ఆర్థిక స్వావలబంన పెరిగింది. వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం. ఇప్పుడు మహిళల నేతృత్వంలో రెస్టారెంట్లు, కుటీర పరిశ్రమలు నడుస్తున్నాయి. అంతేకాకుండా కేరళలో మొత్తం బడ్జెట్‌లో 10ు మహిళలకు(జండర్‌ బడ్జెట్‌) కేటాయిస్తున్నాం. ఆ నిధులతో మహిళాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నాం.

రాజకీయాల్లో మహిళలకు 33ు రిజర్వేషన్లపై మీ అభిప్రాయం?

నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం పురుషుల కంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. 33శాతం కాదు.. మహిళల కోసం అన్ని రాజకీయ పార్టీలు 50ు రిజర్వేషన్‌ అమలు చేయాలి. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కేరళలో అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

ఉపాధి చట్టంలో మార్పులపై మీ అభిప్రాయం?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఆర్థిక బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ఉపాధి హామీ చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపేలా చట్టంలో సవరణలు చేశారు. పని దినాలను తగ్గించారు. వీబీ-జీరామ్‌జీ చట్టం మహిళల ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పాత చట్టం కింద మహిళలకు ఉపాధి దొరికినంతగా కొత్త చట్టం వల్ల లభించదు.

కేరళలో అధికారం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎలా చూస్తారు?

బీజేపీ కేరళలో నెమ్మదిగా చొచ్చుకుపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో డబ్బు, సామాజిక మాధ్యమాల ద్వారా తాను అనుకున్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. చరిత్ర వక్రీకరణ జరుగుతోంది. కేరళ సంస్కృతితో సంబంధం లేకుండా ఉత్తర భారతదేశంలో వారికి నచ్చిన కార్యక్రమాలను మాదగ్గర బలవంతంగా అమలు చేయాలని చూస్తున్నారు.ఆ సంస్కృతిని మాపై రుద్దాలని చూస్తున్నారు. గంగా, యమునా తీరానికి పరిమితమైన కుంభమేళా వంటి కార్యక్రమాలను కేరళకు తీసుకొస్తున్నారు. మన దేశం భిన్న సంస్కృతుల సంగమం. బీజేపీ ఆ సంగమాన్ని దెబ్బతీసి, తనకు నచ్చిన దాన్నే అందరూ పాటించాలనే ధోరణితో పని చేస్తోంది. బీజేపీ చర్యలు దేశానికి ప్రమాదకరం.

Updated Date - Jan 27 , 2026 | 04:33 AM