మీతో చర్చకు దిగను
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:04 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డితో తాను చర్చకు దిగాలనుకోవడం లేదని కేరళం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు.
అందుకు తెలంగాణలో రాజకీయ పార్టీలున్నాయి
ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కేరళ ప్రజలకు జవాబుదారీ
బీజేపీని తీవ్రంగా విమర్శించట్లేదనడం సరికాదు
సీం రేవంత్‌రెడ్డికి కేరళ సీఎం విజయన్ లేఖ
ఆరోపణలకు త్వరలోనే జవాబు చెబుతా: పినరాయి
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డితో తాను చర్చకు దిగాలనుకోవడం లేదని కేరళం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు. దానిపై చర్చించడానికి తెలంగాణలో రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. తాను ‘ఎక్స్’ వేదికగా చేసిన ఆరోపణలకు రేవంత్‌రెడ్డి ఆరు పేజీల లేఖతో బదులిచ్చిన నేపథ్యంలో.. విజయన్ తిరిగి తెలంగాణ సీఎంకు మంగళవారం లేఖ రాశారు. ముందుగా.. బీజేపీయేతర ప్రభుత్వానికి చెందిన తోటి ముఖ్యమంత్రితో రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం పట్ల తాను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇక కేరళలో గత పదేళ్లుగా తాము ఎన్నికల మేనిఫెస్టోలలో ఇచ్చిన హామీల అమలులో సాధించిన పురోగతిని నిరంతరం ప్రజలకు నివేదిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ జవాబుదారీతనం అనేది ఐదేళ్లకు ఒకసారి మాత్రమే కాదని, అది నిరంతరం ఉండాలని తాము నమ్ముతామని పేర్కొన్నారు. ‘‘కేరళ అభివృద్ధిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీ ఘనతలను మా ఖాతాలో వేసుకున్నామంటున్నారు. ఎంపిక చేసిన వాటిని ఆపాదించుకోవడం సుపరిపాలన కాదనే మీ ప్రకటన ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి మాత్రమే కాదు.. మరెవరికైనా వర్తిస్తుంది. కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాలు ‘నవ కేరళ మిషన్స్’ ద్వారా సామాజిక వనరుల కల్పనలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పి కొనసాగించాయి’’ అని విజయన్ పేర్కొన్నారు. ఆ వివరాలను లేఖలో వివరించారు. ప్రస్తుతం కేరళం రాష్ట్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వివక్షను, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటోందని విజయన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సమాఖ్య వ్యతిరేక, లౌకిక వ్యతిరేక, అప్రజాస్వామిక ధోరణిని ప్రతిఘటించడంలో, బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాలను ఒకే వేదికపైకి తేవడంలో కేరళ ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తోందన్నారు. ‘‘ఎల్‌డీఎఫ్, వ్యక్తిగతంగా నేను కేంద్రంలోని బీజేపీని తగినంతగా విమర్శించడం లేదని మీరు ఆరోపించారు. కానీ, హద్దులు దాటే భాష ద్వారా మాత్రమే నిరసన వ్యక్తమవుతుందని మీరనుకుంటే దానితో నేను ఏకీభవించలేను’’ అని విజయన్ తెలిపారు.
త్వరలోనే తగిన జవాబిస్తా
కన్నూర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు తాను త్వరలోనే తగిన విధంగా జవాబిస్తానని కేరళ సీఎం పినరాయి విజయన్ అన్నారు. రేవంత్‌రెడ్డి తనపై బహిరంగంగా ఆరోపణలు చేసినందున తాను కూడా ఆ ఆరోపణలపై బహిరంగంగానే సమాధానమిస్తానని చెప్పారు. మంగళవారం కన్నూర్‌లో విజయన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘నీ పో మోనే విజయా (ఇక నువ్వు దిగిపో విజయా)’ అంటూ తనను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ఓ పాపులర్ సినిమా డైలాగ్‌ను ప్రయోగించడంపై స్పందించారు. ‘డాష్ మోనే రేవంతా.. నీకు త్వరలోనే సమాధానం చెబుతా’ అని అన్నారు. తాను సాధారణంగా ఇలాంటి వాటికి స్పందించనని, కానీ.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కనీస ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి భాష మాట్లాడుతున్నారో సరిచూసుకోవాలని హితవు పలికారు. అయితే ‘డాష్ మోనే రేవంతా’ అంటూ సీఎం విజయన్ చేసిన వ్యాఖ్యలను కేరళ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబాట్టారు. విజయన్ మానసిక సమతుల్యత కోల్పోయారని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ అన్నారు. అదృష్టం కొద్దీ విజయన్ ‘డాష్ మోనే’తోనే ఆగిపోయారని, డాష్ బదులుగా ఏదైనా పదం ఉపయోగించి ఉంటే రాష్ట్రం మొత్తం ఇబ్బందిపడేదని వ్యాఖ్యానించారు.