Share News

Minister Ponguleti Srinivas Reddy: పొగిడేవారి కోసమే జిల్లాలు, మండలాలు ఇచ్చిన కేసీఆర్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:57 AM

గత పాలకులు కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల కేటాయింపును అశాస్త్రీయంగా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు.

Minister Ponguleti Srinivas Reddy: పొగిడేవారి కోసమే జిల్లాలు, మండలాలు ఇచ్చిన కేసీఆర్‌

  • అశాస్త్రీయంగా ఉన్న కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై పునఃసమీక్ష

  • అవసరమైనచోట పునర్‌వ్యవస్థీకరణ, కొత్త మండలాలు ఏర్పాటు చేస్తాం

  • మార్చి నాటికి భూభారతి పోర్టల్‌

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 5(ఆంధ్ర జ్యోతి): గత పాలకులు కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల కేటాయింపును అశాస్త్రీయంగా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ మ్యాజిక్‌ ఫిగర్ల కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, తనను పొగిడినోళ్ల కోసం జిల్లాలు, మండలాలు ఇచ్చారని, తనకు నచ్చనివారి విషయంలో కోరినా ఇవ్వలేదని పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాలు, మండలాల పునర్‌ వ్యవస్థీకరణ, కొత్త మండలాల ఏర్పాటు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి సమాధానం ఇచ్చారు. అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఉన్న కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తోందని తెలిపారు. రెవెన్యూ అధికారుల నుంచి నివేదిక తెప్పించి.. క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత అవసరమైన చోట కొత్త మండలాల ఏర్పాటు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపడతామని చెప్పారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని గండేడు, మహ్మదాబాద్‌ మండలాలను మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిపారని, వాటిని వికారాబాద్‌ జిల్లాలో కలపాలని కోరారు. మునుగోడు, అమ్మనబ్రోలును నూతన మండలాలుగా ప్రకటించాలని, నకిరేకల్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. కాగజ్‌నగర్‌ జనాభా 1.60 లక్షలు ఉందని, ఒకే మండలం కావడంతో తహసీల్దార్‌పై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, అక్కడ పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని మరో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ తెలిపారు. కాగజ్‌ నగర్‌ అర్బన్‌, గ్రామీణం పేరుతో రెండు మండలాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, భూభారతి పోర్టల్‌ను మార్చి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే ల్యాండ్‌ రికార్డుల విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామని చెప్పారు. మంగళవారం నాంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) 2026 డైరీ ఆవిష్కరణ సమావేశంలో మంత్రి మాట్లాడారు. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే 3500 మంది లైసెన్స్‌ సర్వేయర్లను నియమించామని, వారం రోజుల్లో మరో 3,000 మందిని నియమిస్తామని తెలిపారు. ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతం, ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 03:57 AM