ఉంటే ఉండండి.. పోతే పొండి!
ABN , Publish Date - Apr 28 , 2026 | 05:43 AM
పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ లైనుకు కట్టుబడి ఉండాల్సిందేనని, ఇతర పార్టీలవైపు చూస్తూ.. ఆటో కాలు ఇటో కాలు అన్న చందంగా వ్యవహరించవద్దని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అటో కాలు.. ఇటో కాలు వేస్తానంటే కుదరదు
సోషల్ మీడియా డ్రామాలు ఇక్కడ పనిచేయవు
అందరూ పార్టీ లైనుకు కట్టుబడి పని చేయాల్సిందే
అలా ఉండకపోతే సిట్టింగులకూ సీట్లివ్వను
బీఆర్‌ఎస్ నేతలకు కేసీఆర్ గట్టి హెచ్చరికలు
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులతో సమావేశం
కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి
రాష్ట్ర కమిటీ మినహా అన్ని స్థాయుల కమిటీల రద్దు
త్వరలో కొత్తవి.. ఏర్పాటు బాధ్యత కేటీఆర్ కు
తేజస్వీ సూర్య ఓ పెద్ద వెధవ.. పార్లమెంటులో తెలంగాణపై అడ్డగోలుగా మాట్లాడాడు
అయినా, కాంగ్రెస్ వెధవలు అడ్డుకోలేదు
మనవాళ్లుంటే రణరంగం సృష్టించేవారు: కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ లైనుకు కట్టుబడి ఉండాల్సిందేనని, ఇతర పార్టీలవైపు చూస్తూ.. ఆటో కాలు ఇటో కాలు అన్న చందంగా వ్యవహరించవద్దని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘పార్టీలో ఉండదలుచుకుంటే ఉండండి.. లేదంటే, మీకు నచ్చిన పార్టీలోకి వెళ్లండి. అంతేకానీ, ఆటో కాలు ఇటో కాలు వేస్తామంటే కుదరదు. సోషల్ మీడియాలో మీరు వేసే డ్రామాలు ఇక్కడ పని చేయవు. పార్టీ కోసం, ప్రజల కోసం పని చేయండి. ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఇకపై మీ ఆటలు సాగవు’ అని ఘాటుగా హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్ఠతకు చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఫిరాయింపులపై, కొందరు పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపొండి.. కప్పదాటు వ్యవహారాల్ని సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ‘పార్టీ లైన్‌లో పని చేయకపోతే సిట్టింగ్‌లకు కూడా సీట్లు ఇచ్చేది లేదు. మీ నియోజకవర్గాల పరిధిలో మరొకరికి టికెట్ ఇస్తా జాగ్రత్త!’ అని చెప్పినట్లుగా బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇతర పార్టీల అధినేతల్ని కలుసుకొని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న కొందరు బీఆర్‌ఎస్ నేతలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా, పార్టీ బలోపేతానికి కేసీఆర్ పలు నిర్ణయాలు ఈ సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రస్థాయి కమిటీ తప్ప ఇతర అన్ని స్థాయిల కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వాటి స్థానంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కొత్త కమిటీల ఏర్పాటు ప్రక్రియ జరగాలని ఆదేశించారు. ఎల్లవేళలా తెలంగాణకు రక్షణ కవచంలా పని చేసే ఉత్సాహం, పార్టీకి విధేయతతో ఉండే క్యాడర్‌తో కొత్త కమిటీలు వేయాలని సూచించారు. పార్టీలో అంకితభావంతో ఉన్న కార్యకర్తలకు నష్టం కలిగిస్తే గట్టి చర్యలు చేపడతానని హెచ్చరించారు.
శిక్షణా తరగతులు
పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు ప్రారంభించాలని, జిల్లా పార్టీ కార్యాలయాల్లో వీటిని చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు పార్టీ తరఫున విద్యార్థి కమిటీలను ఏర్పాటు చేయాలని, తెలంగాణలో వారియర్స్‌ను (యోధులను) తయారు చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ ఆదేశాలతో.. కొత్త కమిటీల నియామకం, శిక్షణా కార్యక్రమాలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ అంశాల్లో ఇతరుల జోక్యం లేకుండా కేటీఆర్ కీలకంగా వ్యవహరించనున్నట్లు బీఆర్‌ఎస్ శ్రేణులు తెలిపాయి. అయితే, పార్టీలోని ఇతర ముఖ్యనేతలకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేదని పార్టీ వర్గాలంటున్నాయి.
అలా మాట్లాడుతుంటే ఒక్కడూ అడ్డుకోడా?
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఇటీవల తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల మీద కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘పార్లమెంటులో తెలంగాణ గురించి తేజస్వీ సూర్య అనే ఓ పెద్ద వెధవ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే సభలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు ఏమయింది? తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చి మాట్లాడటం దుర్మార్గం. కాంగ్రెస్ వెధవలు ఒక్కరు కూడా అడ్డుకోలేదు. తెలంగాణ పట్ల బీఆర్‌ఎ్‌సకు ఉన్న చిత్తశుద్ధి వారికి ఉండదు. బీఆర్‌ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు’ అని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ అంశంలో రాజీపడాలని సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పినా.. తాను అంగీకరించలేదన్నారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు లేని లోటు కనబడుతోందన్నారు.
ఇళ్ల కూల్చివేతల్లో రాష్ట్రం నెంబర్‌వన్
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావటం లేదని విమర్శించారు. తెలంగాణను బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాల్లో, భూముల కబ్జాలు, ఇళ్ల కూల్చివేతల్లో నంబర్‌వన్‌గా మారుస్తుందన్నారు. పక్క రాష్ట్రాల ప్రజలు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు వస్తుంటే ఈ ప్రభుత్వానికి విగ్రహం ఆవరణలోని గేట్లు కూడా తీయడం చేతకావటం లేదని ఎద్దేవా చేశారు. ఇది చండాలమైన, చిల్లర ప్రభుత్వమని కే సీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్ సోమవారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వచ్చారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) పేరిట కవిత కొత్త పార్టీని ప్రకటించిన నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు కేసీఆర్ చర్యలు చేపట్టారని, ఈ విధంగా కవిత దెబ్బకు కేసీఆర్ దిగివచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.