Share News

నేడు నర్సంపేటకు కేసీఆర్‌

ABN , Publish Date - Aug 09 , 2026 | 06:02 AM

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం వరంగల్‌ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి రానున్నారు.

నేడు నర్సంపేటకు కేసీఆర్‌

  • దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి

  • కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం

హనుమకొండ టౌన్‌/నర్సంపేట/నల్లబెల్లి/హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం వరంగల్‌ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి రానున్నారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం పార్టీ అండగా ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా నిలవనుంది. సుదర్శన్‌ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు అందించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అంతేగాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు, కుటుంబ సంక్షేమం కోసం పార్టీ అండగా నిలుస్తుందని కేసీఆర్‌ పేర్కొన్నారు.

10న పెద్ది సంతాప సభ

సోమవారం పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా నల్లబెల్లిలో నిర్వహించే సంతాప సభకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. తెలంగాణ ఉద్యమానికి పెద్ది చేసిన సేవలను నేతలు ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 06:03 AM