27న బీఆర్‌ఎస్ ప్రత్యేక సమావేశం
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:05 AM
బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపును పురస్కరించుకొని ఈనెల 27న ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
కేసీఆర్ అధ్యక్షతన జరిగే భేటీలో పాల్గొననున్న ముఖ్య నేతలు
పార్టీ సంస్థాగత నిర్మాణం, తాజా రాజకీయాలపై చర్చ
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపును పురస్కరించుకొని ఈనెల 27న ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాల్సిన అంశాలపై కేసీఆర్ మాట్లాడనున్నారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ వంటి అంశాలపైనా సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ముందుకు తీసుకెళ్లడం, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేసే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టతరానుంది. బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.