కేసీఆర్‌ను రాజకీయంగా ప్రజలే చంపేశారు
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:52 AM
తెలంగాణ ఉద్యమాన్ని బూచిగా జూపి ముఖ్యమంత్రి అయి, సర్వం దోచుకున్నారని కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు.
జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్‌ఎస్ విచ్ఛిన్నమే:అద్దంకి, చామల
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమాన్ని బూచిగా జూపి ముఖ్యమంత్రి అయి, సర్వం దోచుకున్నారని కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. ‘నీ చావును ఎవరూ కోరుకోవట్లేదు.. రాజకీయంగా రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చంపేశారు. అందుకే ఫాంహౌస్‌కి పరిమితం చేశారు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కేసీఆర్‌ను భరించే ఓపిక రాష్ట్రానికి లేదన్నారు. హరీశ్‌రావు తొలి నుంచి జీవన్‌రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని... ఈ పరిణామాలే ఆ పార్టీ అంతర్గత విచ్ఛిన్నానికి దారితీస్తాయని దయాకర్ పేర్కొన్నారు. కేటీఆర్ స్వయంగా బతిమాలితే తప్ప హరీశ్‌రావు జగిత్యాల పర్యటనకు రాలేదని.. జీవన్‌రెడ్డి కేసీఆర్‌ను ఫాంహౌస్‌లో కలిసినప్పుడు సైతం ఆయన దూరంగానే ఉన్నారన్నారు. గతంలో కవిత హరీశ్‌పై విమర్శలు చేసి పార్టీకి దూరమయ్యారని, ఇప్పుడు జీవన్‌రెడ్డి వల్ల హరీశ్ బయటకు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ ప్రజల ముందుకొస్తుంటే.. ముఖ్యమైన సభను వదిలేసి హరీశ్‌రావు ఢిల్లీలో ఎవరిని కలిశారో త్వరలో బయటపడుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీలో ముసలం మొదలైందనడానికి ఇదే నిదర్శనమన్నారు.