నా పాడె మోస్తాడనుకున్నా
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:45 AM
పెద్ది సుదర్శన్‌రెడ్డి నా ధైర్యం.. నా పాడె మోస్తాడనుకున్నా. అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం దురదృష్టకరం
ఆయన కుటుంబానికి అండగా ఉంటాం: కేసీఆర్
సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులకు పరామర్శ
బీఆర్‌ఎస్ తరఫున రూ.2.25 కోట్ల సాయం అందజేత
నర్సంపేట/నల్లబెల్లి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ‘పెద్ది సుదర్శన్‌రెడ్డి నా ధైర్యం.. నా పాడె మోస్తాడనుకున్నా. అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని దివంగత నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగృహానికి వచ్చి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం, పార్టీ నిర్మాణం, ప్రజా జీవితంలో సుదర్శన్‌రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. తనకు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకమైన సహచరుడిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, భారీ కాన్వాయ్‌తో ఆదివారం సాయంత్రం 3.40 గంటలకు నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్.. పెద్దసంఖ్యలో జనం గుమిగూడటంతో కారు దిగడానికి ఇబ్బంది పడ్డారు. అనంతరం పోలీసులు వారిని నియంత్రించి కేసీఆర్‌ను ఇంట్లోకి పంపించారు. కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ తరఫున రూ.2.25కోట్ల ఆర్థిక సాయా న్ని కేసీఆర్ అందజేశారు. ఇందులో రూ.2 కోటు సుదర్శన్‌రెడ్డి పిల్లల కోసం, రూ.25 లక్షలు ఆయన తల్లి బాగోగుల కోసం అందించారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా..
కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా.. కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనను చూసేందుకు ఎగబడడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో కేసీఆర్ కాన్వాయ్ వెనుక ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనం అద్దం ధ్వంసమైంది. నల్లబెల్లిలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్‌ను చూసేందుకు ముందుకు దూసుకురావడంతో 20 నిమిషాలపాటు కేసీఆర్ కారులోనే ఉండాల్సివచ్చింది. తిరుగు ప్రయాణంలో బస్టాం డ్ కూడలికి చేరుకోగానే ఓ వ్యక్తి కేసీఆర్‌ను దూషించారు. దీంతో తట్టుకోలేని కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. కేసీఆర్ వెంట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు ఉన్నారు.