కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:25 AM
బీఆర్‌ఎస్ ఆధినేత కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అత్యంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల పట్టణంలో నేషనల్ హైవేపై రోడ్డును తవ్వి పనులు చేపట్టిన ప్రాంతాన్ని బీఆర్‌ఎస్
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఆధినేత కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అత్యంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల పట్టణంలో నేషనల్ హైవేపై రోడ్డును తవ్వి పనులు చేపట్టిన ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉందని, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, మెట్‌పల్లి వైపు నుంచి వచ్చే ప్రజలు, పార్టీ కార్యకర్తలు సభకు రాకుండా అడ్డుకోవడానికే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రధాన రహదారిని తవ్వారని ఆరోపించారు. ఇక్కడ బ్రిడ్జి పనులు మంజూరై రెండేళ్లు కావస్తోందని, అప్పటి నుంచి పనులు చేయకుండా, కేసీఆర్ సభుకు రెండు రోజుల ముందే రోడ్డు కట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. ఇది జగిత్యాల ఎమ్మెల్యే సంకుచిత స్వభావానికి నిదర్శనమని అన్నారు. తాను ఒక సివిల్ ఇంజనీర్‌గా, మాజీ ఆర్ అండ్ బీ మంత్రిగా చెబుతున్నా నేషనల్ హైవేపై పనులు చేసేటప్పుడు ముందుగా ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయా లి, ఇది కనీస నిబంధన అన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు తమ నిత్య పనుల కోసం పట్టణానికి రావాలంటే కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేకు తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఈ వ్యవహారంపై ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు ఎన్‌హెచ్ ఎస్‌ఈతో మాట్లాడి వెంటనే ఇక్కడ డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ టికెట్ ఇచ్చి గెలిపిస్తే, ఇవాళ ఆయన సభనే అడ్డుకోవాలని చూడటం ఎమ్మెల్యే అవివేకమని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగిత్యాల సభను లక్షలాది మందితో విజయవంతం చేసి తీరుతామని ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.