Share News

ధ్వంసం చేసిందే కేసీఆర్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:49 AM

పదేళ్ల తన పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన మాజీ సీఎం కేసీఆర్‌.. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనడం హాస్యాస్పదమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ....

ధ్వంసం చేసిందే కేసీఆర్‌

  • మళ్లీ వస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామనడం హాస్యాస్పదం

  • 2029, 2034లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే

  • రేపటి క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు: మంత్రి కోమటిరెడ్డి

  • కేసీఆర్‌ చావును ఎవరూ కోరుకోలేదు: అడ్లూరి లక్ష్మణ్‌

  • బీఆర్‌ఎ్‌సలో జీవన్‌రెడ్డిని ఎవరూ పట్టించుకోరు: చామల

నల్లగొండ/కరీంనగర్‌ అర్బన్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల తన పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన మాజీ సీఎం కేసీఆర్‌.. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనడం హాస్యాస్పదమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో రూ.6లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాలా తీయించింది వారి హయాంలోనేనని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఒక్కో పథకాన్ని ప్రాధాన్య క్రమంలో అమలుచేస్తూ వస్తున్నామని చెప్పారు. మూసీ ప్రాజెక్టు ఆధునికీకరణకు అడ్డం పడితే బీఆర్‌ఎస్‌కు పుట్టగతులుండవని హెచ్చరించారు. 2029 మాత్రమే కాదు.. 2034 ఎన్నికల్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డి లాంటి వ్యక్తులు బీఆర్‌ఎస్‌లో చేరడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ నెల 23న నిర్వహించనున్న క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఉంటాయని, రాష్ట్ర ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. కేసీఆర్‌ చావును ఎవరు కోరుకోలేదని, ఆయనను వ్యక్తిగతంగా విమర్శించలేదని, ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. జగిత్యాల సభలో కేసీఆర్‌ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని, ఎందుకు పోవాలని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి పండగ.. సోమవారంతో ముగిసిపోయిందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో అలిగినట్లు అక్కడ అలిగితే ఎవరూ పట్టించుకోరని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు.. రాహు, కేతువులంటున్న బండి సంజయ్‌.. ఏ గ్రహానికి చెందినవారని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసును తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టులోనే సీబీఐకి అప్పగించిందని, అయినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేయలేదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీశారు. నమ్మించి మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఎంపీ మల్లు రవి అన్నారు. రావణుడి చేతిలో విభీషణుడు భంగపడ్డట్లు జీవన్‌ రెడ్డి కూడా కేసీఆర్‌ చేతుల్లో మోసపోవడం ఖాయమని పేర్కొన్నారు. తాను చెప్పినట్లుగా వినలేదని చెప్పి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడారని, తద్వారా 42 ఏళ్ల ప్రతిష్ఠను దిగజార్చుకున్నారని విమర్శించారు.


అలిశెట్టి ప్రభాకర్‌ ఆత్మ ఘోషిస్తుంది: వీరేశం

జగిత్యాల సభలో రచయిత అలిశెట్టి ప్రభాకర్‌ పేరును, ఆయన రచనను ప్రస్తావించిన కేసీఆర్‌.. తనకు ఆపాదించుకుని మాట్లాడారని, ఇందుకుగాను అలిశెట్టి ప్రభాకర్‌ ఆత్మ ఘోషిస్తుందని ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం అన్నారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. వాస్తవానికి దొరల గడీలను బద్దలు కొట్టాలని ప్రభాకర్‌ రచనలు చేశారని చెప్పారు. కేసీఆర్‌ ప్రసంగం మొత్తం పిట్టకథలు, ఉత్తమాటలని, అందులో విషం చిమ్మడం తప్ప విషయం లేదన్నారు. జీవన్‌రెడ్డి సొంతంగా గెలిచే నాయకుడు కాదని, పార్టీ గాలి వీస్తే గెలిచే నాయకుడని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చి ఆర్థిక సాయం చేసినా గెలవలేదని విమర్శించారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ సొమ్ము తిన్న ఆయన.. ఒక్క నాయకుడిని కూడా ఎదగనివ్వలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌, జీవన్‌రెడ్డిల వల్ల ఒరిగేది ఏమీ లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ వెంకట్‌ బల్మూర్‌ అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ అధ్యాయం ముగిసిపోయిందన్నారు. బీఆర్‌ఎ్‌సలో పొన్నాలకు పట్టిన గతే జీవన్‌రెడ్డికీ పడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ యాత్రకు సంబంధించి హరీశ్‌రావు బండారం బట్టబయలు కావడంతో.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు కాళేశ్వరం కథలు చెబుతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. ఎవరైనా కోర్టు తీర్పు వచ్చాక అప్పీల్‌కు వెళతారని, కానీ హరీశ్‌రావు ముందే ఎందుకు హడావుడి చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆయన ప్రశ్నించారు.

Updated Date - Apr 22 , 2026 | 04:49 AM