మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:28 AM
మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా సమన్వయంతో పనిచేయాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు.
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయండి
ఆరోపణలు కాదు.. వాస్తవాలను ప్రజలకు తెలపండి: కేసీఆర్
గజ్వేల్/సిద్దిపేట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా సమన్వయంతో పనిచేయాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని, ఆరోపణలు కాదు.. వాస్తవాలను ప్రజలకు తెలపాలని దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండ లం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ప్రశ్నించిన ఆయా అంశాలతో పాటు, విచారణ జరిగిన తీరు తెన్నులపై కేసీఆర్ ఆరా తీశారు. సిట్ ఎదుట చేసిన వాదనలు, వాస్తవాలు ప్రజలకు ఎప్పటికైనా తెలుస్తాయని, ప్రభుత్వం రాజకీయ కక్షల్లో భాగంగానే ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ఆయన అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరుగనున్న దృష్టా పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావాలని, మునిసిపాలిటీల వారీగా ఇన్‌చార్జులను నియమించాలని ఇరువురు నేతలకు సూచించారు. బొగ్గు కుంభకోణం అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వెలుగులోకి వస్తున్న స్కాంలను నిర్భయంగా బయటపెట్టాలని కేసీఆర్ వారికి సూచించినట్లు తెలిసింది.