కేసీఆర్ మళ్లీ గైర్హాజరు
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:58 AM
బీఆర్‌ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మళ్లీ శాసనసభకు గైర్హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు ఉభయ సభల భేటీకి, గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్......
బీఆర్‌ఎస్ నుంచి హాజరైన 38 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
పార్టీ కండువాలు ధరించిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మళ్లీ శాసనసభకు గైర్హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు ఉభయ సభల భేటీకి, గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని అందరూ భావించినా.. ఆయన రాలేదు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి 38 మంది సభకు హాజరయ్యారు. వారంతా బీఆర్‌ఎస్ కండువాలు వేసుకొని రాగా.. వారిలో కొందరు నల్లబ్యాడ్జీలు ధరించారు. సభలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం కొనసాగుతున్నంతసేపు బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులంతా నినాదాలతో హల్‌చల్ చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను క్యూర్ నుంచి తొలగించడానికి సంబంధించిన హిల్ట్ పాలసీని గవర్నర్ ప్రస్తావించగా.. ‘ఇది పెద్ద కుంభకోణం’ అని హరీశ్‌రావు హిందీలో అరిచారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులపై ప్రస్తావిస్తుండగా.. ఫాల్స్ ఫాల్స్ అంటూ నినాదాలు చేస్తూ, ‘‘గవర్నర్ గారూ.. మీతో తప్పులు చెప్పిస్తున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు. .
కండువాలు లేకుండా ‘10 మంది‘ ఎమ్మెల్యేలు
శాసనసభకు సోమవారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయా పార్టీల కండువాలతో హాజరు కాగా.. ‘10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు’ మాత్రం ఏ కండువా వేసుకోకుండానే సభకు వచ్చారు. అయతే వారంతా అధికార కాంగ్రెస్ సభ్యుల పక్కనే కూర్చున్నారు. మజ్లిస్ సభ్యులు షేర్వానీలు ధరించి హాజరయ్యారు.
భట్టి చాంబర్‌లోకి వెళ్లబోయిన ఎమ్మెల్యేలను అడ్డుకున్న గన్‌మెన్లు!
శాసనసభలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం భట్టి చాంబర్‌లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ ప్రయత్నించారు. దీంతో అక్కడున్న గన్‌మెన్లు వారిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు రుసరుసలాడారు. సీఎం చాంబర్ ముందు కూడా ఇలా ఆపరంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. కాగా.. అదే సందర్భంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావును మాత్రం గన్‌మెన్లు అడ్డుకోకపోవడం గమనార్హం.