కేబీఆర్ పార్కు వంతెనల పనులు వేగవంతం
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:14 AM
కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణంలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-2లో పనులు ప్రారంభం కాగా..
ఇప్పటికే రోడ్డు నెంబరు -2లో మొదలైన నిర్మాణాలు
పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో వంతెనలు, అండర్‌పాస్‌లు
వన్ వే ట్రాఫిక్‌పై ఆదివారం ట్రయల్ రన్ పూర్తి
త్వరలో జీహెచ్‌ఎంసీకి నివేదిక ఇస్తామన్న సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణంలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-2లో పనులు ప్రారంభం కాగా.. త్వరలో ఇతర మార్గాల్లోనూ మొదలు పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పార్కు చుట్టూ పలు రోడ్లలో వన్ వే ట్రాఫిక్‌పై పోలీసులు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. దీనిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం నుంచి బసవతారకం ఆస్పత్రి, అగ్రసన్ జంక్షన్, ఫిలింనగర్, రోడ్డు నంబరు45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఉన్న ప్రధాన కూడళ్లను సీపీ సందర్శించిన వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు. ట్రయల్ రన్‌పై నివేదికను జీహెచ్‌ఎంసీకి త్వరలో అందించనున్నట్టు తెలిపారు. నివేదిక ఆధారంగా అవసరమైన మార్పులు చేసిన తర్వాత, ప్రజలకు ముందస్తు సమాచారం అందించి మరోసారి వన్ వే ట్రయల్ రన్‌ను నిర్వహిస్తామని సీపీ వెల్లడించారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవే టివ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)లో భాగంగా రూ.1,090 కోట్లతో పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. రోడ్డు నెంబరు-2లో ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయని, కొన్ని చోట్ల పిల్లర్ల నిర్మాణం మొదలైందని ఇంజనీరింగ్ విభాగం వర్గాలు తెలిపాయి.
ట్రాఫిక్ మళ్లింపు ఎలా..?
పార్కు చుట్టూ వంతెనల నిర్మాణానికి ఇటీవల హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ పనుల వల్ల ఆస్తులు కోల్పోతున్న వ్యక్తుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో పనులు ప్రారంభించడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ఇందుకోసం వాహనాల మళ్లింపు తప్పనిసరి. పార్కు చుట్టూ ఉన్న రోడ్ల మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కోర్ ఏరియా నుంచి ఐటీ కారిడార్‌కు వాహనదారులు ఈ మార్గంలో వెళ్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గాల్లో వాహనాల మళ్లింపు అంత సులువు కాదు. ప్రత్యామ్నాయ రహదారులు అంతగా అందుబాటులో లేకపోవటంతో ఏం చేయాలన్న దానిపై పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. వాహనాలు మళ్లించే మార్గంలో అవసరమైన చోట రోడ్లు విస్తరిస్తామని ఇంజనీరింగ్ అధికారి ఒకరు తెలిపారు.
ఆస్తుల సేకరణే అసలు సవాల్...
వంతెనలు, అండర్ పాస్‌ల నిర్మాణం, రోడ్ల విస్తరణ కోసం రోడ్డు డెవల్‌పమెంట్ ప్లాన్ (ఆర్‌డీపీ) సిద్ధమైంది. ఇప్పటికే సేకరించాల్సిన ఆస్తులకు మార్కింగ్ కూడా వేశారు. విరించి ఆస్పత్రి నుంచి అగ్రసేన్ మహరాజ్ జంక్షన్ వరకు రోడ్డు (రోడ్డు నెం-12) విస్తరణ చేపట్టనున్నారు. రోడ్డు నెంబరు 12ను 80 అడుగులకు.. కేబీఆర్ పార్కు చుట్టూ 120 అడుగులకు పెంచాలని ప్రతిపాదించారు. ఇది జాతీయ పార్కు కావడంతో ఉద్యానవనం వైపు స్థల సేకరణపై అభ్యంతరాలున్నాయి. దీంతో మరో వైపు మాత్రమే ఆస్తులు సేకరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ క్రమంలో భారీగా ఆస్తులు సేకరించాల్సిన వస్తోంది. దీనిపై ఆ ఆస్తుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన ప్రకారం రోడ్డుకు ఇరువైపులా ఆస్తులు సేకరించాలని వాదిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి ఆస్తుల సేకరణపై 50 మందికిపైగా కోర్టుకు వెళ్లారు. సేకరించాల్సిన ఆస్తులకు పరిహారంగా దాదాపు రూ.1,800 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని బల్దియా అధికారులు అంచనా వేశారు. ఆస్తుల సేకరణకు కొన్ని మార్గాల్లో యజమానులకు నోటిసులిచ్చారు. ఇంకొన్ని చోట్ల 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అవార్డు పాస్ చేశారు.