కాజీపేట రైల్వే పనుల్లో రూ.కోట్లలో అవినీతి
ABN , Publish Date - Mar 05 , 2026 | 02:05 AM
కాజీపేటలో రైల్వే ట్రాక్‌ల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కార్మికులు పనిచేయకున్నా చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, తక్కువ మందితో పనిచేయించి ఎక్కువ మంది చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ....
సీబీఐ విచారణ.. 8 మందిపై కేసు నమోదు
కాజీపేట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కాజీపేటలో రైల్వే ట్రాక్‌ల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కార్మికులు పనిచేయకున్నా చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, తక్కువ మందితో పనిచేయించి ఎక్కువ మంది చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి భారీ అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. రైల్వే ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రైల్వేకు కోట్ల రూపాయల మేర నష్టం చేసినట్లు తెలుస్తోంది. రైల్వే అధికారులు, కార్మికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో 2022లో సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ అధికారులు క్రోపి అంధ్యాల, భూమేశ్ గుప్తా, చక్రధర్, ట్రాక్ నిర్వాహకులు మునిగాల రవి, అరుణ్‌కుమార్, సంధ్యా కన్‌స్ట్రక్షన్ మేనేజింగ్ పార్ట్‌నర్ రాజేశం, మేనేజర్ అరుణ్‌కుమార్ కలిసి భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు గత నెల 16న కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంజనీరింగ్ అధికారుల, కార్మికుల బ్యాంక్ ఖాతాలు సరిగ్గా లేకపోవడంతో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. రెండు రోజులుగా సీబీఐ అధికారులు కాజీపేటలో పర్యటించి కేసును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే కాంట్రాక్టర్‌లు, రైల్వే అధికారులు, కార్మికుల మధ్య డబ్బుల పంపకాల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ అక్రమాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం కాజీపేట రైల్వే అధికారుల్లో చర్చనీయాంశమైంది.