ఐదేళ్లలో 200 రైళ్ల తయారీ
ABN , Publish Date - May 29 , 2026 | 03:49 AM
కాజీపేట ‘రైల్ తయారీ కేంద్రం’ (ఆర్‌ఎంయూ)లో త్వరలోనే ఇంటర్‌సిటీ రైళ్ల తయారీని ప్రారంభిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
కాజీపేట ఫ్యాక్టరీ నుంచి సిద్ధం చేయాలనేది లక్ష్యం
పట్టణాలు, నగరాలను కలిపేలా ఇంటర్‌సిటీ రైళ్లు
విద్యార్థులకు, ప్రజలకు ఎంతో సౌలభ్యం
పూర్తికావస్తున్న కాజీపేట ఆర్‌ఎంయూ పనులు
సమీక్షలో రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడి
వరంగల్, న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): కాజీపేట ‘రైల్ తయారీ కేంద్రం’ (ఆర్‌ఎంయూ)లో త్వరలోనే ఇంటర్‌సిటీ రైళ్ల తయారీని ప్రారంభిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాజీపేట ఆర్‌ఎంయూ ఉత్పాదక కార్యాచరణ ప్రణాళికపై గురువారం ఢిల్లీలో రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, సీనియర్ రైల్వే అధికారులతో కలిసి అశ్వినీ వైష్ణవ్ సమీక్ష జరిపారు. ఈ మేరకు రైల్వేశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాజీపేట కర్మాగారం నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని, అక్కడ తయారు చేసే రైళ్లను దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాలకు వినియోగిస్తామని ఈ ప్రకటన వెల్లడించింది. గరిష్ఠంగా 300 కి.మీ.ల మధ్య ఇవి రాకపోకలు జరుపుతాయని, పలు స్టేషన్లలో అగుతాయని పేర్కొంది. ‘పట్టణాలు, నగరాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు, ఆరోగ్య, ఉద్యోగ అవసరాలకు వెళ్లే సాధారణ ప్రజలకు ఈ రైళ్లతో ఎంతో సౌలభ్యం కలుగుతుంది. దేశవ్యాప్తంగా సమీప పట్టణాలను కలిపే షటిల్ సర్వీసుల తరహాలో ఈ ఇంటర్‌సిటీ రైళ్లు నడుస్తాయి. వీటి తయారీ, వినియోగం పెరిగితే స్థానిక రవాణా అధిక శాతం రహదారుల నుంచి రైలు మార్గాల వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ ఇంటర్‌సిటీ రైళ్లకు ఆటోమెటిక్ తలుపులు, మెరుగైన గాలి, వెలుతురు సదుపాయం ఉంటాయి. ఒక్కో రైలులో 20 బోగీలు, ప్రతీ బోగీకి ఇరువైపులా మరుగుదొడ్లు ఉంటాయి. ప్రయాణంలో ఎలాంటి కుదుపులు లేకుండా ఉండేలా ఆధునిక కప్లర్లతో బోగీలను జోడిస్తారు. ఈ రైళ్లు గంటకు 130 కి.మీ.ల గరిష్ఠ వేగంతో నడుస్తాయి. రైళ్లలో పునరుత్పాదక విద్యుత్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. బ్రేకు వేసినప్పుడల్లా విద్యుత్తు ఉత్పత్తి కావటమేగాక ఆ విద్యుత్ గ్రిడ్‌లోకి వెళ్తుంది. ఈ విధంగా ఇంధన పొదుపు, పర్యావరణహిత రవాణాతో కర్బర ఉద్గారాల స్థాయి గణనీయంగా తగ్గుతుంది’ అని ప్రకటనలో వివరించారు. కాగా, కాజీపేట ‘రైల్ తయారీ కేంద్రం’లో రైలు కోచ్‌లతోపాటు, ఇంజిన్లను కూడా తయారు చేస్తారని తెలుస్తోంది.