Share News

‘మీ టైం ముగిసింది.. మా టైం మొదలైంది..’

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:49 AM

మీ టైం ముగిసింది.. ఇక మా టైం మొదలైంది..’’ అంటూ తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్‌ఎస్‌) అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదివారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు..

‘మీ టైం ముగిసింది.. మా టైం మొదలైంది..’

  • కవిత ట్వీట్‌.. రాజకీయ వర్గాల్లో చర్చ

హైదరాబాద్‌/రాంనగర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘మీ టైం ముగిసింది.. ఇక మా టైం మొదలైంది..’’ అంటూ తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్‌ఎస్‌) అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదివారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.. కొత్త పార్టీ ప్రకటన అనంతరం.. ఆమె పెట్టిన పోస్ట్‌ ఎవరినుద్దేశించిందో అన్నదానిపై భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో, ఆ పార్టీని ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేసి ఉంటారని పలువురు అంటుండగా.. కాంగ్రెస్‌, బీజేపీలను టార్గెట్‌ చేసి ఉండొచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కవిత పెట్టిన ఏకవాక్య పోస్టుపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండగా.. మరి కొందరు మాత్రం ‘ఆల్‌ ది బెస్ట్‌ సిస్టర్‌.. మీ కమిట్‌మెంట్‌ గొప్పది.. మేమంతా మీ వెంటే ఉంటాం’ అని మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీని నడిపే ఒక మహిళా నాయకురాలు ఉండటం మంచిదేనని ఓ వ్యక్తి కవిత పోస్టుపై స్పందించడం గమనార్హం.

కవిత పార్టీకి చిన్నారుల తొలి విరాళం

కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీకి తొలి విరాళంగా రాంనగర్‌కు చెందిన చిన్నారులు రిత్విక్‌, దర్శిణిలు.. తాము కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను అందజేశారు. ఆదివారం పార్టీ అధినేత్రి కవితను కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన ‘టీఆర్‌ఎస్‌’ పార్టీకి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఏం చర్చిస్తారు

తాజా రాజకీయ పరిణామాలు.. కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ ప్రకటన.. నేపథ్యంలో కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏం చర్చిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. పార్టీ అంతర్గత విషయాలకే పరిమితమవుతారా..? లేదా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో, కవిత తనపై చేసిన తీవ్ర విమర్శల పట్ల స్పందిస్తారా.. ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ ్యంలో పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ ఎలా దిశానిర్దేశం చేస్తారన్నది రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Updated Date - Apr 27 , 2026 | 04:49 AM