అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం పెట్టాల్సిందే..
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:02 AM
తమ పోరాటం వల్లే ట్యాంక్‌బండ్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇది పాక్షిక విజయమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ....
బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి: కవిత
ఖైరతాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తమ పోరాటం వల్లే ట్యాంక్‌బండ్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇది పాక్షిక విజయమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం పెట్టే వరకు ప్రభుత్వంతో పోరాడుతామని, వారు పెట్టకపోతే జాగృతి అధికారంలోకి వచ్చాక పెడతామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నెక్లె్‌సరోడ్ రోటరీ చౌరస్తాలోని లేక్ వ్యూపార్కులో జరుగుతున్న ఫూలే విగ్రహ ప్రతిష్ఠ పనులను కవిత పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి రెండున్నరేళ్లుగా అసెంబ్లీలో ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం పోరాడుతోందని, ఇక్కడ విగ్రహ ఏర్పాటు సైతం తమ కృషి ఫలితమేనని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ వాటి అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో బీసీలను నియమించాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాట్ల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి వినతులు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం అనుమతినిస్తే తామే ఖర్చులు భరించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.