జీవో 317 బాధిత ఉద్యోగులకు న్యాయం చేయండి
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:49 AM
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తెచ్చిన జీవో 317 మూలంగా నష్టపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ...
వారిని స్వస్థలాలకు బదిలీ చేయండి: సీఎం రేవంత్‌కి కవిత లేఖ
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తెచ్చిన జీవో 317 మూలంగా నష్టపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం లేఖ రాశారు. ఉమ్మడి జిల్లాలు, జోన్‌లలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపాదికన కొత్త జిల్లాలు, జోన్‌లలో పోస్టింగ్స్ ఇచ్చారని, దీంతో వారు సొంత జిల్లాలు వదిలి ఇతర చోట్ల పనిచేయాల్సి వస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబరు 6న జారీ చేసిన 317 జీవోలో స్థానికతపై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జీవో 317తో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అప్పటి సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మీరు లేఖరాశారని రేవంత్‌రెడ్డికి గుర్తుచేశారు. ఈ జీవో బాధితుల సమస్యకు పరిష్కారానికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసినా ఇప్పటివరకు కమిటీ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. బాధితులకు న్యాయం చేేసలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రె్‌స ను గెలిపిస్తే జీవో 317ను సమీక్షించి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, వన్ టైమ్ రిలీఫ్ కింద ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్థానికతను గుర్తించే నిబంధనల్లో మార్పులు చేసి ఇక్కడి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లపాటు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తామనే నిబంధనతో ఇంటర్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఈ ప్రాంత బిడ్డలు స్థానికేతరులవుతున్నారన్నారు. ఒకటి నుంచి 10 వరకు ఏడేళ్లు ఏ రాష్ట్రం, జిల్లాలో చదివితే అక్కడి స్థానికులుగా గుర్తించే పాత ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థినులకు కనీసం శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయని కవిత సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.