కవిత ‘టీఆర్‌ఎస్’ను ఆపేదెలా?
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:18 AM
కల్వకుంట్ల కవిత ఇటీవల ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ.. బీఆర్‌ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ సంక్షిప్త నామంపై బీఆర్‌ఎ్‌సలో గుబులు!.. అడ్డుకునేందుకు న్యాయ నిపుణులతో చర్చలు
కేసీఆర్ నిర్దేశం మేరకు ఇటీవల ఢిల్లీలో.. న్యాయవాదులతో చర్చించిన నేతలు
కొంతకాలంపాటు ఆ పేరును మరొకరికి కేటాయించొద్దని ఈసీని కోరదామా?
మళ్లీ మేమే టీఆర్‌ఎస్‌గా మారతామని చెబుదామా?
ఎలా ఆపొచ్చన్న దానిపై మథనం
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కల్వకుంట్ల కవిత ఇటీవల ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ.. బీఆర్‌ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది. కవిత పార్టీ పేరు పొడి అక్షరాల్లో ‘టీఆర్‌ఎస్’ అని ఉండడమే ఇందుకు కారణం. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా మార్చాక.. పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయని, తిరిగి టీఆర్‌ఎ్‌సగా మారుదామని గులాబీ పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ పేరును కవిత తన పార్టీకి పెట్టుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పేరుతో ముందుకు వెళ్లకుండా కవిత పార్టీని ఆపడం ఎలా? అన్నదానిపై బీఆర్‌ఎస్ నాయకత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టింది. దీనిపై ఆ పార్టీ అధిష్ఠానం ఏకంగా ఢిల్లీ స్థాయి న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిసింది. కవిత తన కొత్త పార్టీ పేరు విషయంలో ఎంతో గోప్యత పాటించినప్పటికీ.. బీఆర్‌ఎస్ అధినాయకత్వంలో కొంత అనుమానం ఉంది. టీఆర్‌ఎస్ అనే సంక్షిప్త నామంతోనే కవిత పార్టీ ఉంటుందని ఆ పార్టీ ప్రకటనకు కొద్దిరోజుల ముందే బీఆర్‌ఎస్ పసిగట్టినట్లు సమాచారం. అందుకే.. దీనికి అడ్డుకట్ట వేయగలమా? ఎన్నికల సంఘం వద్ద ఆపగలమా? అన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఆ పార్టీ నేతలు హరీశ్‌రావు, వినోద్‌కుమార్, రవిచంద్రలకు నిర్దేశించారని తెలిసింది. అందుకే కవిత పార్టీ ప్రకటనకు ముందే ఈ ముగ్గురు నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని సమాచారం.
ఢిల్లీలో న్యాయనిపుణులతో చర్చలు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో తమకు ప్రతికూలంగా తీర్పు వస్తే.. సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకుగాను న్యాయ నిపుణులతో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లామని హరీశ్‌రావు బృందం ఆ పర్యటన సందర్బంగా చెప్పింది. కానీ, దాంతోపాటు వారి పర్యటన అసలు ఉద్దేశం.. కవిత ప్రకటించే పార్టీ పేరు, దాని సంక్షిప్త నామం టీఆర్‌ఎ్‌సను అడ్డుకోవడానికి ఏం చేయవచ్చన్నదానిపై చర్చించేందుకేనని సమాచారం. టీఆర్‌ఎస్ అనే సంక్షిప్త నామాన్ని పదేఽళ్లపాటు మరే పార్టీకీ ఇవ్వవద్దంటూ ఎన్నికల సంఘాన్ని కోరితే ఏమవుతుందన్న కోణంలో వారు చర్చించినట్లు తెలిసింది. అయితే ఇలా కోరడం చెల్లుబాటు కాదని, కోరినా ఎన్నికల సంఘం ఒప్పుకోదేమోనన్న అనుమానాలూ అక్కడ వ్యక్తమయ్యాయి. దీంతో.. బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారుస్తామని, సంక్షిప్త నామాన్ని ఇంకెవరికీ ఇవ్వకుండా ఉంచాలని అడగాలన్న అభిప్రాయమూ వ్యక్తమయిందంటున్నారు. వాస్తవానికి దేశవ్యాప్త రాజకీయాల్లోకి దిగాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా చేసేందుకు బీఆర్‌ఎ్‌సగా పేరు మార్చారు. అయితే పార్టీ పేరు మార్చినప్పటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లడమే కాకుండా.. వరుస ఓటములు చవిచూడాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీకి ఇప్పుడు ఆ పేరే లేకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నదనే విషయాన్ని కూడా ఆ పార్టీ నేతలు అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తరచూ తీసుకువెళ్లారు. గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలోని పార్టీ అభిమానుల నుంచి వస్తున్న సూచనల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చాలని అధిష్ఠానం కూడా భావించింది. అందులో భాగంగానే.. తమ పార్టీకి పాత పేరును పునరుద్ధరించాలని ఆలోచిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఒక సందర్భంలో తెలిపారు. కానీ, ఇదే సమయంలో ఇదే పేరుతో కవిత పార్టీని ప్రకటించడం బీఆర్‌ఎ్‌సను ఇరుకున పడేసింది.
టీఆర్‌ఎస్‌ను వదులుకోకూడదని..
బీఆర్‌ఎస్ ప్రయత్నాలు ఓవైపు సాగుతుండగా.. కవిత మాత్రం తన పార్టీ పేరు, సంక్షిప్త నామం టీఆర్‌ఎస్ అనే ఉండాలని, ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించేలా ప్లాన్-బీని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకే తన పార్టీ జెండాలో టీఆర్‌ఎస్ అనే పేరున్న చోట కిందనే అసోసియేట్ అంటూ చిన్న అక్షరాలతో రాయించారని, ఇబ్బందులు ఏర్పడితే.. టీఆర్‌ఎస్ (ఏ)గా ఆమె తన పార్టీని కొనసాగిస్తారని విశ్వనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. అసలు రాజకీయ పార్టీల సంక్షిప్త నామాలతో తమకు సంబంధం లేదని ఎన్నికల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీకి ఉండే పూర్తిపేరు ఆధారంగానే గుర్తింపు కల్పిస్తామని, సంక్షిప్త నామాలను పరిగణనలోకి తీసుకోబోమని అంటున్నారు.