ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:13 AM
తెలంగాణ భవిష్యత్‌ను మార్చే దారిదీపంలా కొత్త రాజకీయ పార్టీని ఏప్రిల్ 25న ఏర్పాటు చేయబోతున్నామని, మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా ఆ రోజు ఉదయం పార్టీ పేరును ....
మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ప్రకటిస్తాం.. జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మారబోతోంది
మేము ఎవరికీ బీ టీమ్ కాదు
బీఆర్‌ఎస్ క్యాడర్ చాలా వరకు మాతోనే ఉంది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
నిజామాబాద్/హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ భవిష్యత్‌ను మార్చే దారిదీపంలా కొత్త రాజకీయ పార్టీని ఏప్రిల్ 25న ఏర్పాటు చేయబోతున్నామని, మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా ఆ రోజు ఉదయం పార్టీ పేరును ప్రకటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రాంమందిర్‌లో సీతారాముల కల్యాణోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యమ సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుందని తెలిపారు. శ్రీరాముడి పుట్టిన రోజు, పెళ్లి రోజు పర్వదినం సందర్భంగా రాజకీయ పార్టీ ఏర్పాటు తేదీని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా మౌలిక వసతుల కోసం అడుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సంపూర్ణ విజయం సాధించలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఇంకా దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతీరోజు బాధపడుతున్న ప్రజల తరఫున పోరాడేందుకు ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉందన్నారు. మార్పు రావాలని భావించే వారందరినీ తమ పార్టీ ఆవిర్భావ సభకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డగా తాను పెట్టబోయే పార్టీకి ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలని కోరారు. ప్రతి ఊరు నుంచి ఆడబిడ్డలంతా సభకు రావాలని, నిజమైన మార్పు ఎలా ఉంటుందో తాము చేసి చూపిస్తామని చెప్పారు.
కొత్త పార్టీ వచ్చిందంటే ఎవరికో బీ టీమ్ అంటూ విమర్శలు చేస్తారని, కానీ తాము ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. పార్టీ పెట్టిన తర్వాత తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. కాశీకి వెళ్లి శివుడికి అభిషేకం చేసిన తర్వాత పార్టీ సభ నిర్వహిస్తామని కవిత తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పింఛన్ ఇచ్చారని, అందులో 350 మంది రైతుల పేర్లు లేకపోతే ఆ కుటుంబాలకు జాగృతి తరఫున రెండేళ్ల పాటు నెలకు రూ.2500 పింఛన్ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి రాకముందు సమస్యలపై పోరాడి ముఖ్యమంత్రులయ్యాక సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిజాబామాద్ బిడ్డలు తనను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపి రాజకీయ జీవితం ఇచ్చారని, వారి కారణంగానే ఎన్నో పనులు చేశానని, ఎంతో మంది పరిచయం అయ్యారని తెలిపారు. తాను ఢిల్లీలో లాబీయింగ్ చేస్తానని, అవసరమైతే గల్లీలో కష్టపడతా అని తెలిపారు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారుల అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు. గతంలో తనను విమర్శించిన వాళ్లైనా సరే తెలంగాణ కోసం పనిచేసే వాళ్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ క్యాడర్ కూడా చాలా వరకు తమతోనే ఉందని, తమ ఎజెండా మొత్తం ప్రజల ఆమోదం పొందే విధంగా ఉంటుందని కవిత తెలిపారు.
ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
ఏప్రిల్ 24 లేదా 25న కవిత కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. మేడ్చల్ పరిధిలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటిస్తారని ఈనెల 5న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది.