సింగరేణి నియామకాల జోలికొస్తే తాట తీస్తాం
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:50 AM
సింగరేణి సంస్థలో డిపెండెంట్ కార్మికుల నియామకాల జోలికి వస్తే ప్రభుత్వం తాట తీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
బొగ్గుబాయి పేరిట ఉద్యమిస్తాం: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థలో డిపెండెంట్ కార్మికుల నియామకాల జోలికి వస్తే ప్రభుత్వం తాట తీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జాగృతి కార్యాలయంలో ‘సేవ్ సింగరేణి’ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కార్మికుల నియామకాలపై కాదు మీ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు జరిగిన నష్టాన్ని కొంత పూడ్చేందుకు గత ప్రభుత్వం కొన్ని సడలింపులతో 20 వేల కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలసీపై విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే బొగ్గుబాయి పేరిట ఉద్యమిస్తామని కవిత హెచ్చరించారు.