Share News

పాత పేరుతో కొత్త పార్టీనా?

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:47 AM

ఒకే రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా చట్టప్రకారం మనుగడలో ఉన్న పేరును పోలినట్లుగానే మీ పార్టీకి పేరు ఎలా పెడతారు? అంటూ కవిత పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

పాత పేరుతో కొత్త పార్టీనా?

  • ఇప్పటికే ఉన్న టీఆర్‌ఎస్‌ పేరు మీ పార్టీకెలా పెడతారు?

  • ఢిల్లీ హైకోర్టు అసహనం

  • వారంలోగా ఈసీకి వివరణ ఇవ్వాలని ఆదేశం

  • ‘వ్యక్తిగత విచారణ’కు మాత్రం కవితకు వెసులుబాటు

న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఒకే రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా చట్టప్రకారం మనుగడలో ఉన్న పేరును పోలినట్లుగానే మీ పార్టీకి పేరు ఎలా పెడతారు? అంటూ కవిత పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదో అనవసరమైన పిటిషన్‌లా కనిపిస్తోందని, మీ వాదనలేవీ కోర్టు ముందు నిలవబోవని తేల్చి చెప్పింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె కవిత ఆ పార్టీతో విభేదించి కొత్త పార్టీని స్థాపించారు. దీనికోసం ఎన్నికల కమిషన్‌కు మూడు పేర్లతో జాబితాను పంపారు. అందులో తెలంగాణ రక్షణ సమితి పేరును కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) ఖరారు చేసింది. అయితే, పార్టీ పేరు ఖరారుపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం గత నెల జూన్‌ 23న కవితకు నోటీసులు (లేఖ) పంపింది. గతంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీని పోలిన విధంగా, అదే అర్థం వచ్చేలా ఎలాంటి పేర్లు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ ేసన’ లేదా ‘తెలంగాణ రక్షణ సమితి’ అనే పేర్లు.. పాత టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్‌ఎ్‌స)ను పోలి ఉన్నాయని, రెండు పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయని ఈసీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ కవిత పార్టీ తరఫున ఆమె భర్త, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అనిల్‌ కుమార్‌ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. ఆ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.


అభ్యంతరం తెలిపిందెవరో చెప్పాలి

కేంద్ర ఎన్నికల కమిషన్‌ తమకు తెలంగాణ రక్షణ సేన పేరును ఖరారు చేసిందని, కానీ ఆ తర్వాత పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసిందని కవిత భర్త అనిల్‌ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయని ఈసీఐ చెబుతోందని, అభ్యంతరం తెలిపిందెవరో తమకు చెప్పాలని కోరారు. ఈ వాదనలపై జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌ స్పందిస్తూ.. జూన్‌ 23న కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తూ వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని భావించామని న్యాయవాది తెలిపారు. ‘‘కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎంతో బిజీగా ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తామంటూ అవకాశం అడిగితే ఎలా కుదురుతుంది?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి ముందు సమాధానం చెప్పాలని, ఆ తర్వాత అభ్యంతరాలుంటే కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. మీరసలు సమాధానమే చెప్పకముందే కోర్టులు ఇందులో ఎలా జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు. రెండు పార్టీల పేర్లు ఒకేలా ఉన్నప్పుడు ఈసీ అభ్యంతర పెట్టడంలో తప్పులేదు కదా? అని జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు పదే పదే విజ్ఞప్తి చేయడంతో చివరికి న్యాయస్థానం అంగీకరించింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఈసీఐని ఆదేశించింది. కవిత భర్త అనిల్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఒకవేళ కవిత ఈ తీర్పుపై అసంతృప్తితో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మాత్రం.. ప్రస్తుత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ నేరుగా లేదంటే, పరోక్షంగా ఈ వ్యవహారంలో ఇంప్లీడ్‌ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని న్యాయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Updated Date - Jul 08 , 2026 | 06:49 AM