బూర్జువా పార్టీలను వదిలి జాగృతిలో చేరుతున్నారు!
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:34 AM
కొందరు నాయకులు బూర్జువా పార్టీలను వదిలేసి, తమ కొత్త పార్టీలో చేరుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు పలువురు జాగృతిలో చేరారన్నారు.
అన్ని జిల్లాల నుంచి నాయకులు, ఉద్యమకారులు వస్తున్నారు: కవిత
కొత్త పార్టీలో చేరిన బోథ్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): కొందరు నాయకులు బూర్జువా పార్టీలను వదిలేసి, తమ కొత్త పార్టీలో చేరుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు పలువురు జాగృతిలో చేరారన్నారు. అన్ని జిల్లాల నుంచి పార్టీల నాయకులతోపాటు ఉద్యమకారులు జాగృతిలో చేరుతున్నారని తెలిపారు. జాగృతి నుంచే బీఆర్‌ఎ్‌సలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యే అయిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు.. ప్రారంభానికి ముందే కొత్త పార్టీలో చేరారని అన్నారు. ఆదివారం బాపూరావు తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. 2007లో కుటుంబంతో సహా తాను బోథ్‌కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలేసి, కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న జాగృతిలో చేరాలని కవిత పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులయ్యారని, సీనియర్లకు ప్రాధాన్యం కల్పించలేదని బాపూరావు అన్నారు. 2023లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్‌లో చేరితే అక్కడ కూడా తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని చెప్పారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు.
కవిత.. ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. కాగా, కేంద్రం చేపట్టిన జనగణనలో ఆదివాసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్‌చేశారు. చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కవితతో భేటీ అయ్యారు. కేంద్ర విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆదివాసీల భాష ‘కోయతూర్’ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు.