మేం గెలిచిన ఒక్క సీటునూ లాక్కుంటారా..?
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:54 AM
ఎన్నికల్లో తాము గెలిచిన ఒక్క మునిసిపాలిటీని కూడా ముఖ్యమంత్రి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గతంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా.....
ఇలాంటి రాజకీయాల వల్లే బీఆర్‌ఎస్ ఓడిపోయింది
కారు బాటలో నడుస్తున్న కాంగ్రె్‌సకూ అదే గతి
గిరిజనులకు ఇచ్చిన ఏ హామీనీ నేరవేర్చని రేవంత్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో తాము గెలిచిన ఒక్క మునిసిపాలిటీని కూడా ముఖ్యమంత్రి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గతంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని వెగటు రాజకీయాలు చేశారని, ఇలా ప్రతిపక్షాలు ఉండకుండా చేసి ఆ పార్టీ అధికారం కోల్పోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు అదే విధానాలను అవలంబిస్తున్న కాంగ్రె్‌సకు కూడా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో స్థానాలను దక్కించుకున్న సీఎం రేవంత్‌కు.. జాగృతి మద్దతుతో గెలిచిన వడ్డేపల్లి మునిసిపాలిటీ కూడా కావాల్సి వచ్చిందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్లు, ప్రతిపక్షాలు స్థానిక సంస్థల్లో కూడా ఉండకూడదా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకన్నా ప్రతిపక్ష పార్టీల వారినే సీఎం ముందుగా కలుస్తున్నారని విమర్శించారు. బంజారాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని కవిత ధ్వజమెత్తారు. మంత్రివర్గంలో లంబాడీలకు చోటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులలో ఎస్టీలకు అవకాశం ఇస్తామని మాట తప్పారని, అసైన్డ్ భూముల విషయంలోనూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యాజ్యోతి పేరుతో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో అబద్ధాలు చెప్పించారని అన్నారు. పదోతరగతి పాసైతే రూ.10 వేలు ఇంటర్‌కు రూ.15 వేలు, డిగ్రీకి రూ.25వేలు, పీజీకి రూ.లక్ష, ఎంఫిల్‌కు రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి నెరవేర్చలేదన్నారు. సేవాలాల్, ఆదివాసీల, ఎరుకల తెగ పేర్లతో ఏర్పాటు చేస్తామన్న మూడు కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.