Share News

సామాజిక తెలంగాణ కోసం..నా జీవితం అంకితం

ABN , Publish Date - Aug 07 , 2026 | 06:00 AM

సామాజిక తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

సామాజిక తెలంగాణ కోసం..నా జీవితం అంకితం

  • నేను బీసీల కోసం పోరాటం చేస్తుంటే నాది అగ్రకులమని హేళన చేస్తున్నారు

  • నా పుట్టుక నా చేతిలో లేదు.. ఎవరికోసం పనిచేయాలన్నది నా చే తిలోనే ఉంది

  • గతంలో సమాజంలో ప్రజాస్వామిక మార్పు తెచ్చినవాళ్లంతా అగ్రకులాలవారే

  • 5 నెలలపాటు మరిన్ని సంకల్ప సభలు

  • ప్రేమలేఖలు రాసుకునే రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం పనిచేయాలి

  • లేదంటే వెయ్యి కార్లతో ఛలో ఢిల్లీ కార్యక్రమం

  • సామాజిక తెలంగాణ సంకల్ప సభలో కవిత

హైదరాబాద్‌/ మన్సూరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సామాజిక తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సమాజంలోని అట్టడుగు, అణగారిన వర్గాల్లో సాధికారిత సాధించేవరకు తన పోరాటం ఆగదని తెలిపారు. గురువారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు. 10 శాతం ఉన్నవాళ్లు 90 శాతం అవకాశాలను దక్కించుకుంటున్నారని.. 90 శాతం ఉన్నవాళ్లకు సమానంగా అవకాశాలు దక్కాలని అన్నారు. భౌగోళిక తెలంగాణ సాధన తర్వాత సామాజిక తెలంగాణ సాధించాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పేవారని.. ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన జయంతి సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా గ్రామగ్రామాన తమ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తాయని ప్రకటించారు. సావిత్రిబాయి పూలే జయంతి వరకు 5 నెలలపాటు సభలు నిర్వహిస్తామని తెలిపారు. ‘నేను బీసీలకోసం మాట్లాడితే అగ్రకులంలో పుట్టిన నీకెందుకని కొందరు హేళన చేస్తున్నారు. నా పుట్టుక నా చేతిలో లేదు. కానీ, ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకునే హక్కు మాత్రం నాకు ఉంది’ అని ఆమె అన్నారు. ఇప్పటివరకు సమాజంలో జరిగిన ప్రజాస్వామిక మార్పులకు అగ్రకులాల్లో పుట్టిన ప్రజాస్వామికవాదులే కారణమయ్యారన్న విషయం అందరూ తెలుసుకోవాలన్నారు.


రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లకోసం పనిచేయాలి

బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ మోసం చేసిందని కవిత విమర్శించారు. 46 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లింలుంటే 42 శాతం మాత్రమే ఉన్నారని వింత లెక్కలు చూపించారని ఆరోపించారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తూ తరచూ ప్రేమ లేఖలు రాసుకునే సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందేలా ఎందుకు కలిసి పనిచేయరని కవిత ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలోపు బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని, లేదంటే తెలంగాణ రక్షణసేన ఆధ్వర్యంలో వెయ్యి కార్లతో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు సహా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారి అభ్యున్నతికే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీలు ముస్లింలను మాటలతో మోసం చేశాయని విమర్శించారు. సామాజిక తెలంగాణ సాధనలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ కలను తాను సాకారం చేస్తానని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వారిలో 97 శాతం మంది పరిస్థితి దయనీయంగా, బీసీల్లో71 శాతం మంది పరిస్థితి ఎస్సీలకన్నా దారుణంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు రావాలని అన్నారు. సామాజిక తెలంగాణ సాధనపై సభలో పార్టీ శ్రేణులతో కవిత ప్రతిజ్ఞ చేయించారు. సభలో ఆమె 11 తీర్మానాలను ప్రకటించారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకు తెలంగాణ రక్షణసేన ఉద్యమిస్తుందని, పూలే దంపతులకు భారతరత్న పురస్కారం, ప్రొఫెసర్‌ జయశంకర్‌కు పద్మవిభూషణ్‌ ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం లేఖ రాయాలని, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం పెట్టాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాలను ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీల నిధులను వారి అభ్యున్నతికే వాడాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు.

Updated Date - Aug 07 , 2026 | 06:01 AM