మా వల్లే ప్రభుత్వం స్పందించింది
ABN , Publish Date - May 20 , 2026 | 03:05 AM
పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తమ పార్టీ చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించిందని తెలంగాణ రక్షణ సేన..
పాలమూరు ప్రాజెక్టు పనులపై కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మే 19(ఆంధ్రజ్యోతి) : పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తమ పార్టీ చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రశ్నిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పనులపై సీఎం సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో కవిత ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టులో పెండింగ్ ఉన్న పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మొద్దు నిద్ర వీడి త్వరితగతిన భూసేకరణ చేపట్టి పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకొందన్నారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని, భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందాలని కోరారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను మొదలు పెట్టాలని, పెండింగ్‌లో ఉన్న 19, 20, 21 ప్యాకేజీల పనులు ప్రారంభించే వరకు రైతుల పక్షాన టీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని కవిత స్పష్టం చేశారు.