Share News

లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:50 AM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 16న విచారణకు హాజరుకావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు....

లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 16న విచారణకు హాజరుకావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు మరో ఆరుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు గురువారం నోటీసులు అందచేశారు. ఈ నోటీసులపై ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన కవిత.. ఢిల్లీ మద్యం కేసును రౌస్‌ అవెన్యూ కోర్టు కొట్టేయడంతో పాటు దర్యాప్తు అధికారిపై విచారణ చేపట్టాలని వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. నోటీసుల ఆధారంగా ఈనెల 16న విచారణకు హాజరవుతానన్నారు. ఈ విషయంపై తమ లీగల్‌ టీమ్‌తో చర్చలు జరుపుతున్నానని, న్యాయం గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని కవిత వెల్లడించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి గతంలో నేరారోపణలు ఎదుర్కోన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆడిటర్‌ బుచ్చిబాబు, రామచంద్ర పిళ్లై, శరత్‌ చంద్రారెడ్డి, బోయిన్‌పల్లి అభిషేక్‌లకు సైతం హైకోర్టు జారీ చేసిన నోటీసులను సీబీఐ అధికారులు అందచేశారని సమాచారం. 16వ తేదిన తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఉంటుందని, హజరుకాని పక్షంలో ఎక్స్‌పార్టీ విచారణ సాగుతుందని నోటీసులో స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాలు చేసిన క్రమంలో ఈ కేసులో నిందితులంతా వేర్వేరుగా తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది.

Updated Date - Mar 13 , 2026 | 04:50 AM