ఆ 1400 కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చినవి కావా?
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:20 AM
‘‘బీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చినవి కావా? అవి ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చినవి కాదా?’’ అని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు..
క్విడ్‌ప్రో కో ద్వారా వచ్చినవి కావా?
ఆ సొమ్ములు అమరుల కుటుంబాలకు పంచిపెట్టండి
బీఆర్‌ఎస్‌కు కవిత డిమాండ్.. కేటీఆర్, హరీశ్‌లపై ధ్వజం
కొత్తగూడెం/బయ్యారం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చినవి కావా? అవి ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చినవి కాదా?’’ అని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిలదీశారు. పార్టీ ఖాతాలో ఉన్న ఆ అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పంచాలని ఆమె డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీశ్‌రావునే బీఆర్‌ఎస్ ఇంకా ముందు పెడుతోందని, ఇక ఆ పార్టీ బాగుపడదని, జన్మలో అధికారంలోకి రాదని దుయ్యబట్టారు. తాను మళ్లీ బీఆర్‌ఎస్ లోకి వెళ్తానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ.. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎ్‌సలో చేరేదే లేదని ఆమె తేల్చిచెప్పారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెం పీవీకే- 5 ఇంక్లైన్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘బీఆర్‌ఎస్ పార్టీని జోడెడ్లలాగా నడపాల్సినోళ్లు.. ఇద్దరూ కూడా దున్నపోతుల్లాగా ప్రజల సమస్యలను మర్చిపోయి అడ్డగోలుగా అవినీతిపరులను కాపాడుతున్నారు’’ అని నిప్పులు చెరిగారు. ‘‘ఇంగ్లిష్ పేపర్లలో నా గురించి వార్తలు వస్తే కేటీఆర్ ఢిల్లీకి ఫోన్ చేసి ‘ఎందుకేస్తారు?’ అని ఇంగ్లిష్‌లో అడుగుతాడట. వాళ్లు ఫోన్ చేసి చెప్తారు నాకు.. ఇంత సిగ్గులేని వ్యవహారమెందుకు?’’ అని నిలదీశారు. తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చిన కవిత.. ‘‘సభ్యత మరిచి తిడితే కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా’’ అని హెచ్చరించారు.