Share News

తండ్రిగా గౌరవిస్తారాజకీయంగా విభేదిస్తా

ABN , Publish Date - May 03 , 2026 | 04:38 AM

కేసీఆర్‌ స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లో పోరాటం చేస్తున్నా. తండ్రిగా ఆయనపై నాకు గౌరవం ఉన్నా.. మా దారులు వేరుగా ఉన్నాయి.

తండ్రిగా గౌరవిస్తారాజకీయంగా విభేదిస్తా

  • కేసీఆరే నాకు స్ఫూర్తి.. మా దారులే వేరుగా ఉన్నాయి.. పార్టీ ప్రకటనకు ముందు చాలా కుట్రలు జరిగాయి

  • మేం గెలిచాక విద్య, వైద్యం ఉచితం.. లేకపోతే రాళ్లతో కొట్టండి

  • ప్రజలంటే లెక్కలేనితనం వల్లే బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయింది

  • రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో తప్పించుకోలేరు

  • ‘మీట్‌ది ప్రెస్‌’లో కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్ర జ్యోతి): ‘‘కేసీఆర్‌ స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లో పోరాటం చేస్తున్నా. తండ్రిగా ఆయనపై నాకు గౌరవం ఉన్నా.. మా దారులు వేరుగా ఉన్నాయి. రాజకీయ నేతగా కేసీఆర్‌తో కచ్చితంగా విభేదిస్తా. నేను నాన్నను తిట్టలేదు. బీఆర్‌ఎస్‌ అధినేతను మాత్రమే విమర్శించా’’ అని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో శనివారం తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో పాల్గొన్న కవిత.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అమ్మ పాలనతో అన్ని వర్గాల్లో వెలుగులు నింపడమే తమ పార్టీ విధానమని వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటు గురించి తాను ప్రకటించినప్పటి నుంచీ చాలా కుట్రలు జరిగాయన్నారు. ఆ కుట్రలను ఎదుర్కొనేందుకే వ్యూహాత్మకంగా తొలుత తెలంగాణ రాష్ట్ర సేన పేరును చెప్పాల్సి వచ్చిందన్నారు. అన్ని అడ్డంకులు దాటుకుని ప్రజల ఆశీస్సులు, దేవుడి దయతో తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) పేరును కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఆమోదం లభించిందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా కుటుంబాలు విద్య, వైద్యం కోసం.. వారి ఆదాయంలో 60 శాతం ఖర్చు చేస్తున్నాయని, ఆ పరిస్థితిలో మార్పు తేవాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. విద్యతోపాటు వైద్యం ఉచితంగా ఇవ్వకపోతే తనను రాళ్లతో కొట్టాలని సూచించారు. జెన్‌జీ యువతకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని, చాలా దేశాల్లో 18-19 ఏళ్ల యువత మిలీనియర్లుగా మారడమే అందుకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలోని జెన్‌జీ యువతకు రూ.2లక్షల నుంచి రూ.20కోట్ల వరకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. యువతను ఉద్యోగాలిచ్చే స్థాయికి తీసుకొస్తామన్నారు.


ఇచ్చిన మాట.. పట్టిన తోవ విడవను

ఇచ్చిన మాట.. పట్టిన తోవ విడవకుండా ఉండే వ్యక్తిత్వం తనదని కవిత చెప్పారు. గతంలో కేసీఆర్‌ సచివాలయానికి రావడం లేదని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సీఎంగా సచివాలయం రాకపోవడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదల ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రా.. మంత్రులు పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా 1000 రోజులు మాత్రమే అధికారంలో ఉంటుందని.. అన్ని రోజులూ కాళ్లకు బలపం కట్టుకుని ప్రజల్లో తిరుగుతామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతానన్నారు. ప్రజలంటే లెక్కలేనితనం వల్లే బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు అదే పరిస్థితి ఎదురవుతుందని జోస్యం చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇప్పుడు తప్పించుకున్నా.. ఎన్నికల వేళ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

విమర్శలు చేసే వారిని పట్టించుకోను

తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు లక్ష సూపర్‌న్యూమరరీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వీరే పర్యవేక్షిస్తారని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం 4లక్షల ఉద్యోగాలతో ఒకే సారి ప్రకటన ఇస్తామని హామీ ఇచ్చారు. అమ్మ లాంటి పాలన చేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఎవరు విలనో.. వారే తనకూ విలన్‌ అని ప్రకటించారు. తన పార్టీపై రాజకీయ విమర్శలు చేసే వారిని పట్టించుకోబోనని తెలిపారు. తనను విమర్శించే ముందు బీజేపీ నాయకులు తెలంగాణకు మేలు చేయాలని సూచించారు. తమ పార్టీని తక్కువ చేసి మాట్లాడే వారి మాటలను ప్రజలు గమనిస్తున్నారని.. కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పురుషుల కన్నా గొప్పగా పార్టీని నడుపుతానని, అధికారంలోకి వచ్చాక కూడా సమర్థంగా పని చేస్తానని చెప్పారు. పొత్తు పెట్టుకునే పరిస్థితి వస్తే ఆలోచిస్తామన్నారు. మాజీ మావోయిస్టులు పార్టీలో చేరుతామంటే.. ఆహ్వానిస్తామన్నారు.

Updated Date - May 03 , 2026 | 04:38 AM